హైదరాబాద్ మహా నగరంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. కాచిగూడ పరిధిలోని బర్కత్‌పురలో గల ఓ ఇంట్లో ఏసీ పేలి కవలలు మరణించారు. నిన్న సాయంత్రం మూడేళ్ల రహీం ఖాద్రి, రెహ్మాన్ ఖాద్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఏసీ బ్లాస్ అయ్యింది. మంటలు చెలరేగడం, పొగ కారణంగా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కొల్పోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఏసీ కంప్రెషర్ర్ పేలినట్టు అనుమానిస్తున్నారు. నాణ్యమైన స్టెబిలైజర్ వాడాలని క్రమం తప్పకుండా ఏసీని సర్వీసింగ్ చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు.
సాయంత్రం 4.55 గంటలకు తమకు ఫోన్ వచ్చిందని, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని అగ్నిమాపక నియంత్రణ అధికారులు తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చే సమయానికి, ఇద్దరు చిన్నారులు చనిపోయారని నిర్ధారించారు. సుందర్ నగర్‌లోని ఒక ఇంట్లో ఈ సంఘటన జరిగింది. ఎయిర్ కండిషనర్ యూనిట్‌లో మంటలు చెలరేగడంతో గది అంతా దట్టమైన పొగతో నిండిపోయిందని ప్రాథమిక సమాచారం.
ఆ సమయంలో గదిలోనే ఉన్న చిన్నారులు పొగ పీల్చడం వల్ల ఊపిరాడక స్పృహ కోల్పోయి ఉండవచ్చని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వారు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని, అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు.