హైదరాబాద్‌లో ట్రాఫిక్ కొత్త రూల్స్.. అతిక్రమిస్తే భారీ జరిమానాలు
Hyderabad traffic police roll out action plan to rein in violators.రోప్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో
By తోట వంశీ కుమార్ Published on 1 Oct 2022 4:23 AM GMTహైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రంగంలోకి దిగారు. పలు మార్లు ట్రాఫిక్ విభాగం అధికారులతో సమావేశమై ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రోప్(రిమూవల్ ఆఫ్ అబ్‌స్ట్రిక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్‌మెంట్) పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు ట్రాఫిక్ పోలీసులు.
కొత్త రూల్స్‌లో భాగంగా.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100 జరిమానా విధించనున్నారు. అంతేకాకుండా సిగ్నళ్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే ఏకంగా 1000 రూపాయల ఫైన్ వేయనున్నారు. ఇక పాదచారులకు అడ్డంగా వాహనాలు నిలిపే వారికి రూ.600 పెనాల్టీ విధించనున్నారు. ఈ నిబంధనలు అక్టోబర్ 3 నుంచి అమల్లోకి రానున్నాయి. వాహనదారులు నిబంధనలు పాటించి సహకరించాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ కోరారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవన్నారు.
పార్కింగ్ కోసం స్థలం కేటాయించాల్సిందే..
ఆర్టీసీ బస్సులు బస్ బేలలోనే నిలపాలని, అదే విధంగా ఆటోలు ఎక్కడ పడితే అక్కడ నిలుపకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సీవీ ఆనంద్ సూచించారు. వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు.. రహదారులు, ఫుట్ పాత్ ల పైకి రాకుండా చర్యలు చేపట్టాలని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాసంస్థల్లో 30 శాతం, హోటళ్లు, లాడ్జ్‌లు, వాణిజ్య సముదాయాల్లో 40 శాతం, మాల్స్, మల్టీఫ్లెక్స్‌లలో 60శాతం స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించాల్సి ఉంటుందన్నారు. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయని భవనాలపై జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి చర్యలు తీసుకునే విధంగా ముందుకు సాగనున్నారు.