రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి తనిఖీలు

నగరంలో అర్ధరాత్రి దాటిన తర్వాత జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు అర్ధరాత్రి 12

By అంజి  Published on  16 May 2023 9:14 AM IST
Hyderabad, Traffic Police, drunk driving

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి తనిఖీలు

హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి దాటిన తర్వాత జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య తనిఖీలు నిర్వహిస్తున్నారు. అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జి సుధీర్ బాబు మాట్లాడుతూ.. అర్థరాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాల కేసుల పెరుగుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లలో అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల మధ్య తరచుగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగి వాహనాలు నడిపే వారితో రోడ్డు ప్రమాదాలు జరిగిన హాట్‌స్పాట్‌లను ప్రత్యేక బృందాలు గుర్తించి తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

''ప్రత్యేక బృందాలకు ఇన్‌స్పెక్టర్ లేదా సబ్-ఇన్‌స్పెక్టర్ నేతృత్వం వహిస్తారు. పట్టుబడిన వారందరినీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. సందేశం స్పష్టంగా ఉంది. ట్రాఫిక్ పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటారు. అర్ధరాత్రి దాటి బయటకు వచ్చి డ్రైవ్ చేస్తే తప్పించుకోగలమని ప్రజలు భావించకూడదు'' అని జి సుధీర్ బాబు అన్నారు. నగరంలో హోటళ్లు, బార్‌లు, పబ్‌లు ఉండటంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారి రద్దీ ఎక్కువగా ఉండే హాట్‌స్పాట్‌లను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.

''డ్రంక్ డ్రైవింగ్ చెకింగ్ మొత్తం వీడియో గ్రాఫ్ చేయబడింది. తద్వారా పట్టుబడిన వ్యక్తులు తప్పించుకోలేరు. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసు అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తూ పట్టుబడుతున్నారు. స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లలో తగిన కేసుల కింద వారిని బుక్ చేయగలిగాము'' అని చెప్పారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది ఇప్పటివరకు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 13,431 మందిని పట్టుకోగా, 1317 మందిని జైలుకు పంపారు. 243 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు. కోర్టు ఆదేశాలతో రోడ్డు రవాణా సంస్థ అధికారులు 53 మంది లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపినందుకు గాను మొత్తం రూ.3,21,39,060 జరిమానా విధించారు. పట్టుబడిన వారు గోషామహల్, బేగంపేటలోని ట్రాఫిక్ శిక్షణా సంస్థలో కౌన్సెలింగ్ కార్యక్రమానికి హాజరుకావాలి.

Next Story