Hyderabad: మూసీ నది ప్రక్షాళన.. మొదలైన ఇళ్ల కూల్చివేతలు

హైదరాబాద్‌ నగరంలో మూసీ నది ప్రక్షాళన మొదలైంది. మూసీ నదిని శుభ్రపరిచే ప్రాజెక్టులో భాగంగా నగరంలోని.. నది పరివాహక ప్రాంతాల్లో కూల్చివేత కార్యక్రమం ప్రారంభమైంది.

By అంజి  Published on  1 Oct 2024 12:26 PM IST
Hyderabad, authorities, demolishing, vacated houses, Musi river bed

Hyderabad: మూసీ నది ప్రక్షాళన.. మొదలైన ఇళ్ల కూల్చివేతలు 

హైదరాబాద్‌ నగరంలో మూసీ నది ప్రక్షాళన మొదలైంది. మూసీ నదిని శుభ్రపరిచే ప్రాజెక్టులో భాగంగా నగరంలోని.. నది పరివాహక ప్రాంతాల్లో కూల్చివేత కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి దశలో మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను రెవెన్యూ శాఖ, మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు కూల్చివేయడం ప్రారంభించారు. చాదర్‌ఘాట్‌, మూసా నగర్‌, రస్సోల్‌పురా, వినాయక్‌ నగర్‌, శంకర్‌ నగర్‌లోని ఇళ్లను బృందాలు కూల్చివేశాయి.

శంకర్‌నగర్‌లో మూసీ రివర్‌బెడ్‌లో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు. వీధులు ఇరుకుగా ఉండటంతో కూలీల సహాయంతో కూల్చివేతలు సాగుతున్నాయి. నిర్వాసితులను డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు తరలిస్తున్నారు. నిర్వాసితుల సామగ్రి తరలింపునకు వెహికల్స్‌ ఏర్పాటు చేశారు. అటు చాదర్‌ ఘాట్‌ ప్రాంతాల్లో మార్క్‌ చేసిన ఇళ్లను నేలమట్టం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆ గృహాల్లో నివసిస్తున్న వారందరికీ సైదాబాద్‌ తదితర ప్రాంతాల్లో 2బీహెచ్‌కే ఇళ్లు కేటాయించామని తెలపిఆరు. ఇళ్ల కూల్చివేతల నేపథ్యంలో శంకర్‌ నగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.

హైదరాబాద్‌లో నిర్మాణాల కూల్చివేతలను ఉద్దేశిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి కాదు.. ఆయన తాత వచ్చినా ఏం చేయలేరని అన్నారు. ఏ ఇంటికి బుల్డోజర్లు వచ్చినా అందరూ కలిసి అడ్డుకోవాలన్నారు. ప్రభుత్వం ఏం ఇచ్చినా కదలొద్దని కేటీఆర్‌ ప్రజలకు సూచించారు. అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో కేటీఆర్‌ సమావేశం అయ్యారు.

Next Story