'కరెంట్ స్తంభాలపై కేబుల్స్ తొలగించండి'.. కేబుల్, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు TGSPDCL ఆదేశం
విద్యుత్ స్తంభాల నుండి అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని టీజీఎస్‌పీడీసీఎల్ ఎండీ ముష్రఫ్ ఫరూఖీ కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించారు.
By అంజి Published on 30 Aug 2024 2:52 PM IST'కరెంట్ స్తంభాలపై కేబుల్స్ తొలగించండి'.. కేబుల్, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు TGSPDCL ఆదేశం
హైదరాబాద్: విద్యుత్ స్తంభాల నుండి అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్‌పీడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ముష్రఫ్ ఫరూఖీ ఆగస్టు 30, శుక్రవారం, కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించారు. లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని, ఆదేశాలు పాటించకుంటే తామే స్వయంగా కేబుళ్లను తొలగిస్తామని విద్యుత్ శాఖాధిపతి తెలిపారు.
టీజీఎస్‌పీడీసీఎల్ ప్రకారం.. జూలై 27, ఆగస్టు 7, ఆగస్టు 28 తేదీల్లో కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేబుల్స్ తొలగింపు గురించి తెలియజేయడానికి సమావేశాలు జరిగాయి. "ఆగస్టు 7వ తేదీన జరిగిన సమావేశంలో, ప్రధాన రహదారులపై ఒక వారంలోపు, ఇతర ప్రధాన రహదారులపై రెండు వారాల్లోగా నిబంధనల ప్రకారం కేబుల్స్ తొలగించడానికి ఆపరేటర్లు చర్యలు తీసుకోవాలని కోరారు" అని ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
కొంతమంది కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సమావేశాల్లో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ తొలగింపు ప్రక్రియకు సహకరించడం లేదని విద్యుత్ పంపిణీ సంస్థ పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యుత్ స్తంభాలకు కేబుల్స్, కేబుల్ బండిల్స్, వివిధ టెలికాం పరికరాలు వేలాడదీయడం వల్ల అనేక ప్రమాదకర సంఘటనలు చోటుచేసుకోవడంతో సమావేశం నిర్వహించారు.
“సరైన కేబుల్ నిర్వహణ లేకపోవడం వల్ల.. సాధారణ ప్రజలు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు సంభవించడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్ స్తంభాలపై అదనపు భారం పడుతుండడంతో అవి వంగిపోతున్నాయి. ఇంకా, తీగల కారణంగా స్తంభాలపై నిర్వహణ పనులు చేయడంలో విద్యుత్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు” అని టీజీఎస్‌పీడీసీఎల్ తెలిపింది.
అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కేబుల్ కంపెనీలు, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు తగిన సమయం ఇచ్చామని, అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కేబుల్స్ తొలగించలేదని TGSPDCL పేర్కొంది. "ఒకవేళ అంగీకరించిన విధంగా కేబుల్ తొలగింపు ప్రక్రియ పూర్తి కాకపోతే, మా సిబ్బంది వాటిని తొలగిస్తారు" అని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అన్నారు.