అరెరే వీళ్లు మోసగాళ్లకే మోసగాళ్లు ఉన్నారే.. అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించడమే కాకుండా దర్జాగా ఇక్కడే ఉంటూ నయా దందాకు తెర లేపారు.. వీళ్లు అలాంటి ఇలాంటి దందా చేయడం లేదండోయ్.. ఏకంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ చేసి ఇచ్చేస్తున్నారు. కమిషనర్ టాస్క్ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ తయారు చేస్తున్నా ముఠా గుట్టు రట్టైంది.
బంగ్లా దేశస్తులకు బర్త్ సర్టిఫికెట్ తయారు చేస్తున్న ఆరుగురు సభ్యుల్లో ఇద్దరు బంగ్లా దేశస్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని మలక్పేట్ పోలీసులకు అప్పగించారు. ఈ నిందితులు స్థానికంగా ఉంటూ భరత్ బంగ్లా సరిహద్దులు దాటి కలకత్తా నుండి హైదరాబాద్ చేరుకుంటున్న బంగ్లా దేశస్థులకు నకిలీ బర్త్ సర్టిఫికెట్ తయారు చేసి ఇస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
నగరంలోని నార్సింగి మున్సిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సుధీర్, రజినీకాంత్ ఈ ఇద్దరు వ్యక్తులు మరి కొంతమందితో కలిసి ఈ నయా దందాను దర్జాగా కొనసాగిస్తున్నారు. వీళ్ళు ఒక్కొక్క బర్త్ సర్టిఫికెట్ కు ఐదు లక్షల రూపాయల వరకు వసూళ్లు చేస్తున్నారు. పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో మరి కొంతమంది కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు ఎంత మందికి నకిలీ బర్త్ సర్టిఫికెట్లను జారీ చేశారని కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.