హైదరాబాద్: కేపీహెచ్‌బీలో ఇద్దరు వాహనదారులను లక్ష్యంగా చేసుకున్న దొంగలు వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, మొబైల్ ఫోన్లను దోచుకెళ్లారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ)లో గురువారం, నవంబర్ 13న రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు వ్యక్తుల మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసులు దోచుకెళ్లారు. మొదటి కేసులో కేపీహెచ్‌బీ కాలనీ బ్రాండ్ ఫ్యాక్టరీ రోడ్డు వద్ద ఓ వ్యక్తి వద్దకు రెండు బైక్‌లపై నలుగురు దొంగలు వచ్చారు. బాధితుడిని కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్, 1.5 తులాల బంగారు గొలుసు అపహరించారు. జగద్గిరిగుట్టకు చెందిన బాధితుడు అరుణ్‌రావు మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా దుండగులు అతని వద్దకు వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు.
అనంతరం రాత్రి వేళలో మరో బాధితుడైన ప్రైవేట్ ఉద్యోగి నరేష్‌ని అగంతకులు బెదిరించి అతడి మొబైల్ ఫోన్ లాక్కున్నారు. బాధితులు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా కేపీహెచ్‌బీ పోలీసులు రెండు దోపిడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ఈ ప్రాంతంలో దొంగలు వాహనదారులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు చాలా జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు.