రాయదుర్గంలో కారు ప్రమాదం, ఒకరు మృతి, నలుగురికి గాయాలు
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు వేగంగా వచ్చి అదుపుతప్పింది.
By Srikanth Gundamalla Published on 22 Dec 2023 2:08 PM ISTరాయదుర్గంలో కారు ప్రమాదం, ఒకరు మృతి, నలుగురికి గాయాలు
హైదరాబాద్‌లోని రోడ్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. రద్దీగా ఉన్నా కూడా కొందరు వాహనదారులు త్వరగా గమ్య స్థానాలకు చేరుకోవాలనో.. లేదంటే ఇంకొందరు ఆకతాయిలు స్టంట్స్ చేస్తూ ఇతరులను భయబ్రాంతులకు గురిచేస్తారు. ఈ క్రమంలోనే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు వేగంగా వచ్చి అదుపుతప్పింది. ఒక్కసారిగా బోల్తా పడటంతో ఘోరప్రమాదం జరిగింది. కారులో ఉన్న వారిలో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి వద్దకు రాగానే ఒక కారు అతివేగంగా నడిపారు. దాంతో.. అదుపు తప్పి వేగంగా డివైడర్‌ను ఢీకొట్టింది. దాంతో.. ఆ కారు పల్టీలు కొట్టింది. ఈ సంఘటనతో మిగతా వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు యువకులు ఉన్నారు. ఇందులో శివరామకృష్ణ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో.. గాయపడ్డవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. శివరామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశామనీ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కాగా.. అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు.