బైక్‌ను ఢీకొట్టిన బస్సు, ఒకరు మృతి..డ్రైవర్, కండక్టర్ పరారీ

హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  18 Aug 2023 6:59 AM GMT
Hyderabad, Road Accident, Bus, Driver, conductor, escape,

బైక్‌ను ఢీకొట్టిన బస్సు, ఒకరు మృతి..డ్రైవర్, కండక్టర్ పరారీ 

హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాంతో.. బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ భయంతో ఘటనాస్థలి నుంచి పరారయ్యారు.

మధురానగర్ పరిధిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల రోడ్డుప్రమాదం సంభవించింది. రెహమమత్‌నగర్ సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్సు అత్యంత వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి ఎగిరి రోడ్డుపైన పడిపోయాడు. దాంతో.. అతని తలకు తీవ్రంగా గాయం అయ్యింది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో.. సదురు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆర్టీసీ బస్సు బోరబండ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న క్రమంలో మితిమీరిన వేగంతో వెళ్లి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఇదే సమయంలో బస్సులో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. మహిళలు కూడా ఫుట్‌బోర్డింగ్ చేస్తున్నారు. చివరి మెట్టుపైన నిలబడి ఉన్న ఓ యువతి కూడా కిందపడిపోయింది. అయితే.. వెంటనే స్పందించిన బస్సులో ఉన్న కొందరు వ్యక్తులు, స్థానికులు ఆ యువతిని పైకి లేపారు. ఆమె క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ బస్సులో నుండి దూకి పరారైనట్లుగా ప్రయాణికులు తెలిపారు. రోడ్డు మధ్యలో ఈ ప్రమాదం జరగడం, బస్సు డ్రైవర్ పారిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం ట్రాపిక్‌ను క్లియర్ చేశారు. పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సిసి ఫుటేజ్ ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story