Hyderabad: నేటి నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన మెట్రో ఛార్జీలు

సవరించిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కనిష్ఠంగా టికెట్‌ ధర రూ.11, గరిష్ఠంగా రూ.69గా మెట్రో యాజమాన్యం నిర్ణయించింది.

By అంజి
Published on : 24 May 2025 8:03 AM IST

Hyderabad, metro fares, Hyderabad Metro Rail, Fare Fixation Committee

Hyderabad: నేటి నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన మెట్రో ఛార్జీలు

హైదరాబాద్‌: సవరించిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కనిష్ఠంగా టికెట్‌ ధర రూ.11, గరిష్ఠంగా రూ.69గా మెట్రో యాజమాన్యం నిర్ణయించింది. కనిష్ఠంగా రూ.12, గరిష్ఠంగా రూ.75కు పెంచగా ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే పెంచిన ధరలపై 10 శాతం డిస్కౌంట్‌ ఇస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

రెండు కిలోమీటర్ల లోపు రూ.11, 2 నుంచి 4 కిలోమీటర్ల వరకు రూ.17, 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు రూ.28, 6 నుంచి 9 కిలోమీటర్ల వరకు రూ.37, 9 నుంచి 12 కిలోమీటర్ల వరకు రూ.47, 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు రూ.51, 15 నుంచి 18 కిలోమీటర్ల వరకు రూ.56, 18 నుంచి 21 కిలోమీటర్ల వరకు రూ.61, 21 నుంచి 24 కిలోమీటర్ల వరకు రూ.65, 24 కిలోమీటర్ల పైన అయితే రూ.69 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో రైలును ఎక్కువగా ఆఫీసు ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు, వ్యాపార కార్యనిర్వాహకులు, చిన్న వ్యాపారులు ఉపయోగిస్తున్నారు. తాజాగా ధరలు విపరీతంగా పెరగడంపై ప్రయాణికులు టికెట్ కౌంటర్‌లోని మెట్రో రైలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎల్ అండ్ టి మెట్రో రైలు ధరల పెంపుపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ మెట్రో ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది.

హైదరాబాద్‌లో మొత్తం మెట్రో రైడర్ల సంఖ్య 4.57 లక్షలు. కొన్ని రోజుల్లో ఆ సంఖ్య 5 లక్షలకు చేరుకుంటుంది. ఎల్బీ నగర్ నుండి మియాపూర్, ఓల్డ్‌ సిటీ నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌కు అనుసంధానించే మెట్రో రైలు హైదరాబాద్ కు సులభమైన ప్రయాణ మార్గంగా మారింది.

Next Story