హైదరాబాద్ వాసులకు తప్పనున్న పాస్‌పోర్టు సేవల కష్టాలు

హైదరాబాద్ వాసులకు పాస్‌పోర్టు సేవలను మరింత ఈజీగా చేసేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

By -  Knakam Karthik
Published on : 16 Sept 2025 1:41 PM IST

Hyderabad News, Passport Services, MGBS, Minister Ponnam Prabhakar

హైదరాబాద్ వాసులకు పాస్‌పోర్టు సేవలను మరింత ఈజీగా చేసేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో నూతనంగా పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఈ సెంటర్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ మార్పుతో సిటీలోని రెండు ప్రధాన పాస్‌పోర్టు సేవా కేంద్రాల అడ్రస్‌లు మారాయి.

అయితే ఇన్ని రోజులు అమీర్‌పేటలోని ఆదిత్య ట్రేడ్ సెంటర్‌లో కొనసాగిన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఇప్పుడు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌కు పూర్తిగా తరలించారు. అదేవిధంగా, టోలీచౌకీ షేక్‌పేట్‌లోని ఆనంద్ సిలికాన్ చిప్ భవనంలో పనిచేస్తున్న మరో కేంద్రాన్ని రాయదుర్గం పాత ముంబయి రోడ్డులోని సిరి బిల్డింగ్‌లోకి మార్చారు. మంగళవారం నుంచి ఈ రెండు కేంద్రాలు తమ కొత్త ప్రదేశాల నుంచి పూర్తిస్థాయిలో సేవలను అందిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, పాస్‌పోర్ట్‌ల జారీలో హైదరాబాద్ దేశంలోనే ఐదో స్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మిర్జా రియాజ్ ఉల్ హసన్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, పాస్‌పోర్ట్స్ జాయింట్ సెక్రటరీ కే.జే.శ్రీనివాసులు, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు.

Next Story