ఆహార కల్తీలో నెంబర్ 1 గా మారిన హైదరాబాద్

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారం కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Feb 2024 8:15 AM GMT
Hyderabad, food adulteration cases, NCRB data, GHMC

ఆహార కల్తీలో నెంబర్ 1 గా మారిన హైదరాబాద్ 

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారం కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. NCRB సర్వే చేసిన 19 నగరాల్లో.. హైదరాబాద్ 246 ఆహార కల్తీ కేసులతో అగ్రస్థానంలో ఉంది. దేశంలోని మొత్తం కేసులలో ఇది 84 శాతం. కల్తీని తనిఖీ చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) లో కేవలం 30 మంది ఆహార భద్రతా అధికారులు మాత్రమే ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఎన్‌జిఓ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్రంలో విపరీతంగా ఆహార కల్తీలు పెరిగిపోయాయని అంటున్నారు. లాభాల మార్జిన్‌లను పెంచుకోవడానికి ఆహారం కల్తీ చేస్తున్నారని తేలింది. సరిగా నిల్వ చేయకపోవడం.. ప్యాకింగ్ కోసం ఉపయోగించే పదార్థాల కారణంగా ఆహారం కల్తీ జరుగుతోంది.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఆహార కల్తీలు

పండ్లను కృత్రిమంగా మాగేయడానికి (ముఖ్యంగా మామిడి, అరటిపండు) హానికరమైన రసాయనాలు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈథెఫోన్, ఎథ్రెల్, కాల్షియం కార్బైడ్‌లను ఉపయోగిస్తూ ఉన్నారు. ఆహార పదార్థాల రంగు, వాసన, ఆకృతిని నిలుపుకోవడానికి రసాయనాలను ఉపయోగిస్తారు. అధికారుల అనుమతులు పొందిన ఆహార పదార్థాలు ఎలాంటి హాని కలిగించవు కానీ.. చౌకైన, నిషేధించిన పదార్థాలు ప్రమాదాలను కలిగిస్తాయి.

కల్తీ ఆహారాన్ని తీసుకోవడం పిల్లలతో సహా ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కల్తీ ఆహారం వల్ల అలర్జీ, పేగులు దెబ్బతినడం, చూపు కోల్పోవడం, కీళ్ల నొప్పులు, జీర్ణకోశ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, దీర్ఘకాలంలో క్యాన్సర్, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. ఖర్చులు తగ్గించుకోడానికి, అత్యాశతో వ్యాపారులు కల్తీకి పాల్పడుతున్నారు.

ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 అంటే ఏమిటి?

1954లో ఆహార కల్తీ నిరోధక చట్టం ప్రవేశపెట్టారు. ఆహార కల్తీపై అనేక ఇతర చట్టాలు కూడా ఉన్నాయి. చివరగా, అన్ని చట్టాలను ఏకీకృతం చేయడానికి, పార్లమెంటు ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 (FSS చట్టం)ను రూపొందించింది. చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం.. ఉత్పత్తి, ప్రాసెసింగ్, దిగుమతి, పంపిణీ, అమ్మకం.. ఇలా అన్ని దశలలో ఆహారంలో ఉపయోగించే పదార్థాల నాణ్యత తప్పనిసరి. చట్టం ప్రకారం, ఏ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ కూడా అసురక్షితమైన, తప్పుగా బ్రాండ్ చేసిన, ఏ మాత్రం ప్రమాణాలు లేని వస్తువులను వాడకూడదు. కల్తీ చేసిన ఆహార పదార్థాలను నిల్వ చేయడం, విక్రయించడం లేదా పంపిణీ చేయడం వంటివి చేయకూడదు. చట్టం బలంగా ఉన్నప్పటికీ, సిబ్బంది కొరత, రాజకీయాలు, అవినీతి కారణంగా నిబంధనలు పాటించడం లేదు.

Next Story