Hyderabad: PVNR ఎక్స్‌ప్రెస్ వేపై కారు బీభత్సం
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 8 Oct 2023 5:03 AM GMTHyderabad: PVNR ఎక్స్‌ప్రెస్ వేపై కారు బీభత్సం
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళ్తూ మరో కారుని ఢీకొట్టింది. దాంతో.. రెండు కార్ల చక్రాలు ఊడిపోయాయి. ఈ సంఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి.
రాజేంద్రనగర్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై 198 పిల్లర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. TS 20 EG 7980 నెంబర్ ప్లేట్ ఉన్న కారు అతివేగంగా ఎక్స్‌ప్రెస్ వేపైకి వచ్చింది. ఉదయం వేళ కావడం రోడ్డు ఖాళీగా ఉండటంతో మరింత వేగంగా పోనిచ్చారు. అయితే.. పిల్లర్ నెంబర్ 198 వద్దకు రాగానే కారు అదుపుతప్పింది. దాంతో.. డివైడర్‌ను ఢీకొట్టింది. అక్కడ డ్రైవర్ కారుపై పూర్తిగా అదుపు కోల్పోయాడు. దాంతో.. ముందు వెళ్తున్న మరో కారుని ఢీకొట్టింది. కారు అత్యంత వేగంగా వెళ్తుండటంతో రెండు కార్ల టైర్లు ఒకదానిని ఒకటి ఆనుకున్నాయి. ప్రమాద తీవ్రతతో రెండు కార్ల టైర్లు ఊడిపోయాయి. అదృష్టవశాత్తు కార్లు బోల్తా పడలేదు. కార్ల టైర్లు ఊడిపోయాక పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపైనే ఆగిపోయాయి. ఈ ప్రమాదంలో ఈ రెండు కార్లలో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. కాగా.. మరో కారు మెహదీపట్నం నుంచి ఎయిర్‌పోర్టుకు ప్రయాణికుడిని ఎక్కించుకుని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారుని మైనర్లు నడుపుతున్నట్లు వారు గుర్తించారు. అత్యంత వేగంగా నడపడం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని.. టైర్లు ఊడిపోయేంతలా తీవ్రత ఉందంటే ఎంత స్పీడ్‌లో వెళ్లారో అర్థం చేసుకోవచ్చని పోలీసులు అంటున్నారు. ఇక సంఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. ప్రమాదానికి కారణమైన మైనర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు పోలీసులు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.