హైదరాబాద్: సోమాజిగూడలోని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వెంటనే బాంబు డిటెక్షన్ స్క్వాడ్‌లు, యాంటీ సెబోటేజ్ టీమ్‌లు, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజాభవన్‌లో తనిఖీలు చేస్తున్నారు. సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆవరణలోకి ఎవరూ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు.
ప్రజా భవన్ (గతంలో ప్రగతి భవన్) తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అధికారిక నివాస వసతిగా ఉంది. ప్రజా భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రజా భవన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఫోన్ చేసిన ఆగంతకుడిని ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలోని ప్రముఖ ప్రదేశాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.