హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోలీసు వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పోలీస్ విభాగం ‘సీపీతో ఒక రోజు’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ బుధవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 45 రోజుల పాటు సాగనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా, ప్రతిరోజూ ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి 20 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి పోలీసుల పనితీరును ప్రత్యక్షంగా చూపిస్తారు.
తొలిరోజు మంగళహాట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సీపీతో గడిపారు. ఈ సందర్భంగా సజ్జనర్ గారు విద్యార్థుల సమక్షంలోనే బాధితుల ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కార మార్గాలను వివరించడమే కాకుండా.. హనుమాన్ జయంతి బందోబస్తుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వారిని భాగస్వామ్యం చేశారు. అంతకుముందు విద్యార్థులు కమాండ్ కంట్రోల్ సెంటర్, షీ టీమ్స్, సైబర్ క్రైమ్ విభాగాలను సందర్శించి సాంకేతికత వినియోగాన్ని తెలుసుకున్నారు. చట్టం పట్ల గౌరవం, సామాజిక బాధ్యత పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని సీపీ పేర్కొన్నారు. డీసీపీ డాక్టర్ లావణ్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.