నుమాయిష్ పునః ప్రారంభం.. ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad Police issues traffic advisory for annual trade fair.నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నేటి(శుక్రవారం)
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2022 3:51 PM ISTనాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నేటి(శుక్రవారం) నుంచి నుమాయిష్(అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన) పునఃప్రారంభమైంది. కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నెల 25 వరకు నుమాయిష్ ను నిర్వహించనున్నట్లు సొసైటీ సెక్రటరీ ఆదిత్య మార్గం తెలిపారు. ప్రతి సంవత్సరం 2500 స్టాళ్లను ఏర్పాటు చేస్తుండగా.. ఈ సారి కరోనా నిబంధనలు అనుసరించి 1500 స్టాళ్లను మాత్రమే ఏర్పాటు చేశారు. నుమాయిష్‌కు సందర్శకుల తాకిడి నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం వద్ద సందర్శకులను తనిఖీ చేసిన తర్వాతే మైదానంలోకి అనుమతిస్తారు. సందర్శనకు వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయనున్నారు.
ఇక ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనరాకపోకలపై ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపారు.
- జామ్‌బాగ్, ఎస్‌ఏ బజార్‌ల వైపు నుంచి ఎంజే మార్కెట్ మీదుగా నాంపల్లి వెళ్లే వాహనాలను ఎంజే మార్కెట్ నుంచి అబిడ్స్ మీదుగా పంపుతారు.
- పోలీసు కంట్రోల్ రూమ్, ఫతేమైదాన్ వైపు నుంచి నాంపల్లి, ఎంజే మార్కెట్ వైపు వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు మళ్లీస్తారు.
- బేగంబజార్ ఛత్రి వైపు నుంచి మాలకుంట వైపు వెళ్లే భారీ సరుకు రవాణా వాహనాలను అలాస్కా జంక్షన్ నుంచి దారుస్సలాం మీదుగా పంపిస్తారు.
- దారుస్సలాం నుంచి వచ్చే భారీ వాహనాలు, డీసీఎంలు అలాస్కా వద్ద కుడివైపు తిరిగి ఫీల్‌ఖానా, బేగంబజార్ ఠాణా మీదుగా ఎంజే మార్కెట్, అబిడ్స్ చేరుకోవాల్సి ఉంటుంది.