హైదరాబాద్: నగరంలో హోలీ వేడుకలు ప్రశాంతంగా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సూచించారు. సోమవారం టీజీఐసీసీసీ (TGICCC) నుండి పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన భద్రతా ఏర్పాట్లపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరవ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, ఆకతాయిల ఆటకట్టించేందుకు షీ టీమ్స్ (SHE Teams) మఫ్టీలో నిఘా ఉంచుతాయని వెల్లడించారు. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
బహిరంగ ప్రదేశాల్లో, పాదచారులపై బలవంతంగా రంగులు చల్లడం నిషిద్ధం. వేడుకల్లో డీజేలకు (DJs) అనుమతి లేదు. రసాయన రంగులకు బదులు ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలని కోరారు. హోలీ సందర్భంగా మంగళవారం (03-03-2026) ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశించారు.
రంజాన్ మాసం కావడంతో ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పీస్ కమిటీలతో సమన్వయం చేసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని, ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సీపీ స్పష్టం చేశారు.