హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో చైనీస్ మాంజా వాడకం వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. దక్కనీ ఉర్దూ, తెలంగాణ యాసలో చేసిన ఆయన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
గాలిపటాలు ఎగరేయడంపై ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసిన సీపీ, చైనీస్ మాంజా వల్ల రోడ్లపై ప్రయాణించే వారి ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉందని తెలిపారు. గతంలో బైక్‌పై వెళ్తూ మాంజా చుట్టుకుని జరిగిన ప్రాణాంతక ఘటనలను గుర్తు చేస్తూ, ఇది కేవలం ఆట కాదని హెచ్చరించారు.
చైనీస్ మాంజాను దాచినా, అమ్మినా, వాడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు. ఇలాంటి మాంజా విక్రయాలు ఎక్కడైనా కనిపిస్తే 94906 16555 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలంటే చైనీస్ మాంజాకు పూర్తిగా దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.