సంక్రాంతికి ఊరెళ్తే సమాచారమివ్వండి..నగరవాసులకు సీపీ సజ్జనర్‌ విజ్ఞప్తి

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ కీలక సూచనలు చేశారు

By -  Knakam Karthik
Published on : 4 Jan 2026 7:25 PM IST

Hyderabad New, Police Commissioner VC Sajjanar,  Sankranti Safety Alert, Hyderabad Police

సంక్రాంతికి ఊరెళ్తే సమాచారమివ్వండి..నగరవాసులకు సీపీ సజ్జనర్‌ విజ్ఞప్తి

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారు.. వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్‌' (ట్విటర్‌) వేదికగా నగరవాసులను అప్రమత్తం చేశారు.

పండుగ వేళ చాలామంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్తుంటారని, ఇదే అదనుగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశముందని సీపీ పేర్కొన్నారు. ప్రయాణానికి ముందే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లోగానీ, బీట్‌ ఆఫీసర్‌కు గానీ సమాచారం ఇస్తే.. పెట్రోలింగ్‌లో భాగంగా సిబ్బంది ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని తెలిపారు.

ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదని సీపీ సజ్జనార్‌ ప్రజలకు హితవు పలికారు. వాటిని బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవడం ఉత్తమమని సూచించారు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా చోరీలను నివారించవచ్చని, తద్వారా పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని పేర్కొన్నారు.

ఆధునిక పోలీసింగ్‌ అంటే కేవలం నేరాలు జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాదని, నేరాలను ముందుగానే నివారించడం కూడా అని ఆయన అభిప్రాయపడ్డారు. పండుగ సీజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు, మీ ఇళ్ల భద్రతకు పోలీస్‌ శాఖ కట్టుబడి ఉందని, ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. అత్యవసర సమయంలో వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని సీపీ సూచించారు.

Next Story