డెక్కన్‌ మాల్‌ అగ్ని ప్రమాదం.. బిల్డింగ్‌ ఓనర్‌పై కేసు నమోదు

Hyderabad Police Books Case Against Deccan Mall Building Owner. హైదరాబాద్‌: సికంద్రాబాద్‌లోని డెక్కన్‌ మాల్‌ భవనంలో గురువారం నాడు భారీ అగ్ని ప్రమాదం

By అంజి  Published on  20 Jan 2023 11:30 AM IST
డెక్కన్‌ మాల్‌ అగ్ని ప్రమాదం.. బిల్డింగ్‌ ఓనర్‌పై కేసు నమోదు

హైదరాబాద్‌: సికంద్రాబాద్‌లోని డెక్కన్‌ మాల్‌ భవనంలో గురువారం నాడు భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ భవనం యజమాని మహమ్మద్ ఒవైసీపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ బాల ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యజమానిపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి మహ్మద్ ఒవైసీ, ఎంఏ రహీమ్‌లను బాధ్యులను చేశారు. ఈ భవనానికి ఎలాంటి సెట్ బ్యాక్ లేదని, జీహెచ్‌ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా మాల్‌ను నిర్వహిస్తున్నారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటనలో నలుగురు కాపాడినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. నివేదికల ప్రకారం.. అగ్నిమాపక సిబ్బంది మంటల్లో చిక్కుకున్న వసీం, జునైద్, జహీర్ అనే ముగ్గురు వ్యక్తులను రక్షించడానికి భవనంలోకి వెళ్లారు. భవన యజమానిని కూడా సిబ్బంది లోపలికి తీసుకెళ్లారు. మంటలను అదుపు చేసే క్రమంలో అస్వస్థతకు గురైన అగ్నిమాపక సిబ్బందిలో ఒకరిని నిన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసియులో చికిత్స పొందుతున్నారు.

గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ 24 ఫైరింజన్లను రంగంలోకి దించింది. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా చుట్టుముట్టింది. పొగను నియంత్రించడానికి అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడ్డారు. మండే పదార్థం భారీ మొత్తంలో నిల్వ చేయబడి ఉండటంతో.. భవనంలో గ్యాలన్ల నీటిని చల్లినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. మంటలు, దట్టమైన పొగలు కమ్ముకోవడంతో చుట్టుపక్కల భవనాలు, మురికివాడల్లో ఉంటున్న ప్రజలను ఖాళీ చేయించారు.

హోంమంత్రి మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌యాదవ్‌ ఘటనాస్థలిని సందర్శించి, ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించిన పక్షంలో సదరు భవన యజమానిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక చర్య అర్థరాత్రి వరకు కొనసాగింది. ఇంకా కొన్ని అగ్నిమాపక యంత్రాలు ఇవాళ ఉదయం నుంచి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు రహదారి క్లోజ్‌ అయ్యింది. జీహెచ్‌ఎంసీ బృందాలు భవనాన్ని పరిశీలించి, కూల్చివేయాలా వద్దా అనే దానిపై నిర్మాణ స్థిరత్వాన్ని అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాయి.

Next Story