హైదరాబాద్ ఫేజ్ -II మెట్రో.. డిసెంబర్ నాలుగో వారం నుంచి ఆస్తుల కూల్చివేతలు
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణలో భాగంగా రెండో దశ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
By Kalasani Durgapraveen Published on 26 Nov 2024 4:01 PM ISTహైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణలో భాగంగా రెండో దశ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణకు మణిహారంగా నిలిచిన ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైల్ పట్టాలెక్కి ఈ నెల 28వ తేదీకి సరిగ్గా ఏడు సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ ప్రస్థానం, రెండో దశలో చేపట్టబోయే పనులపై హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్), హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి మీడియా సమావేశం ముఖ్య అంశాలు:
• మెట్రో రైల్ మొదటి దశ మొత్తం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర 57 స్టేషన్లతో నిర్మించబడింది .
1. మియాపూర్ - ఎల్ బీ నగర్: 29 కి.మీ; 27 స్టేషన్లు
2. జేబీఎస్-ఎంజీబీఎస్ : 11 కి.మీ; 8 స్టేషన్లు
3. నాగోల్ - రాయదుర్గ్ : 29 కి.మీ; 22 స్టేషన్లు
• ఇది ప్రపంచంలోనే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానం (పిపిపి)తో చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్ట్. పూర్తి ఎలివేటెడ్ మెట్రో ప్రాజెక్ట్
• రూ.22,148 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేయబడింది (తెలంగాణ ప్రభుత్వం ద్వారా రూ.2,970 కోట్లు; భారత ప్రభుత్వం ద్వారా రూ.1,204 కోట్లు మరియు రూ.17,974 కోట్లు అంటే, 81% ప్రైవేట్ రంగ రాయితీ సంస్థ L&T మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్)
• అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలతో ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ మెట్రో లో రోజూ దాదాపు 5 లక్షల మంది ( సుమారు 6.60 లక్షల పాసింజర్ ట్రిప్స్) ఈ మొదటి దశ మార్గాలను వినియోగించుకుంటున్నారు.
• అత్యధిక రైడర్‌షిప్ రికార్డ్: ఆగస్ట్ 14, 2024న 5.63 లక్షల మంది (7.43 మంది పాసింజర్ ట్రిప్స్) ప్రయాణించారు.
• మొదట్లో మెట్రో రైల్ మొదటి దశలో మన నగరం దేశంలో ఢిల్లీ తర్వాత 2వ స్థానంలో నిలిచింది.
• గత పదేళ్లలో ఈ మార్గాల విస్తరణకు సరి అయిన చర్యలను తీసుకోలేదు. కానీ మిగిలిన నగరాలన్నీ వాటి వాటి రెండవ దశ, మూడవ దశ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టి ముందుకు దూసుకు పోతున్నాయి.
• ఇప్పుడు హైదరాబాద్, ఆపరేషనల్ నెట్‌వర్క్‌లో 3వ స్థానానికి పడిపోయింది - 1 స్థానం: ఢిల్లీ (415కిమీ); 2వ స్థానం: బెంగళూరు (74 కిమీ)& 3వ స్థానం: హైదరాబాద్ (69 కిమీ).
• వెంటనే చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్ 9వ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది. పూర్తి రెండవ దశ అమలుతో మళ్లీ హైదరాబాద్ 3వ స్థానానికి చేరుకుంటుంది.
• ముంబయి, బెంగళూరు, చెన్నై మొదలైనవి ఒక్కొక్కటి రూ. 50,000 కోట్ల నుండి రూ. లక్ష కోట్ల వరకు విస్తరణ ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి.
• మెట్రో విస్తరణకు డిమాండ్ పెరగడంతో పాటు మొదటి దశ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రెండవ దశ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించడం జరిగింది.
• గత 10 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన పది సమీక్షా సమావేశాలు: జనవరి 04; జనవరి 09; ఫిబ్రవరి 22; ఏప్రిల్ 22; మే 15; మే 23; మే 27; ఆగస్ట్ 17; సెప్టెంబర్ 13; సెప్టెంబర్ 24, 2024.
• సిస్ట్రా కన్సల్టెంట్ల ద్వారా ట్రాఫిక్, ట్రాన్స్పోర్టేషన్ సర్వేలు జరిగాయి. LEA, Aarvee వంటి ఇతర ఏజెన్సీల మునుపటి అధ్యయనాలు పరిగణనలోకి తీసుకోబడ్డాయి.
• రెండవ దశ రూట్ ఎంపికలో సమాజంలోని అన్ని వర్గాల అవసరాలను తీర్చడం, అన్ని వైపులా నగరం సమాన వృద్ధి సాధించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన.
• అన్ని వైపులా ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా, ఇప్పటికే ఉన్న కారిడార్‌ల విస్తరణ; కొత్త ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్‌కు ఇప్పటికే ఉన్న 3 కారిడార్‌ల కనెక్టివిటీ అన్నది మెట్రో రెండవ దశ ప్రధాన లక్ష్యం.
• ఆరు ఫేజ్-II కారిడార్లు 116.4 కి.మీ ఉంటాయి, 'సిస్ట్రా' ద్వారా 76.4 కి.మీ పొడవుతో 5 కారిడార్‌లకు డిపిఆర్ పూర్తయింది.
• 6వ కారిడార్ (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫోర్త్ సిటీ : 40 కిమీ) ప్రతిపాదనలు విడిగా రూపొందించడం జరుగుతోంది. మిగిలిన 5 కారిడార్‌లకు (76.4 కిమీ) డీపీఆర్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదంతో 04.11.2024న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబడింది.
• విమానాశ్రయ ప్రాంతంలో 1.6 కి.మీ అండర్ గ్రౌండ్ మార్గం కాగా, మిగిలిన మొత్తం ఫేజ్-II కారిడార్లు ఎలివేట్ చేయబడ్డాయి.
• దీర్ఘచతురస్రాకార/వృత్తాకార స్తంభాలు (పియర్లు) సుమారు 2 మీటర్ల (7 అడుగులు) వ్యాసంలో; 8 మీటర్ల (26 అడుగుల) ఎత్తులో ఉంటాయి, ఒక్కొక్క స్తంభం మధ్య 25 మీటర్ల (82 అడుగుల) దూరం ఉంటుంది.
• సగటు వేగం: 35 kmph (ఎయిర్‌పోర్ట్ లైన్ సగటు వేగాన్ని మాత్రం పెంచే అవకాశం ఉంది)
• రెండవ దశలో MMTS, TGRTC, స్విదా, ర్యాపిడో వంటి వివిధ రకాల రవాణా మార్గాలతో అనుసంధానం చేసే ప్రతిపాదన ఉంది.
• సిగ్నలింగ్, OHE, ఫేర్ కలెక్షన్, రోలింగ్ స్టాక్ మొదలైన వాటి కోసం తాజా సాంకేతికతలు ప్రతిపాదించబడ్డాయి.
• ప్రారంభంలో 3కోచ్ ల రైళ్లు; తరువాత 6కోచ్ ల రైళ్లకు పెంచే అవకాశం ఉంది. 6కోచ్ ల రైళ్ల కోసం ప్లాట్‌ఫారమ్‌లు నిర్మించబడతాయి.
• ఫేజ్ -I అనుభవంతో, పార్కింగ్, బస్ బేలు, ఆటో/ఫీడర్ సర్వీసెస్ బే లు మొదలైన వాటి కోసం గ్రౌండ్ లెవెల్లో మరింత స్థల సేకరణపై దృష్టి సారించడం జరుగుతుంది.
• 5 కారిడార్‌ల మొత్తం ఖర్చు (76.4 కిమీ; 54 స్టేషన్లు): రూ.24,269 కోట్లు.
• ప్రాజెక్ట్ అమలు చేసే ఏజెన్సీ: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML)
• కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50:50 జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్ట్‌గా మెట్రో రెండో దశ చేపట్టాలన్నది ప్రతిపాదన.
నిబంధనల ప్రకారం ప్రతిపాదిత నిధుల నమూనా:
• తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాటా: రూ.7,313 కోట్లు (ప్రాజెక్ట్ వ్యయంలో దాదాపు 30%)
• కేంద్ర ప్రభుత్వ వాటా: రూ.4,230 కోట్లు (ప్రాజెక్ట్ వ్యయంలో దాదాపు 18%)
• 48% అంటే రూ.11,693 కోట్లను ప్రాజెక్ట్ రుణాలుగా కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే “సావరిన్ గ్యారంటీ”తో JICA, ADB, NDB వంటి మల్టీ లేటరల్ సంస్థల నుండి సేకరించడం జరుగుతుంది.
• 4% ఖర్చును అనగా రూ.1,033 కోట్ల పెట్టుబడిని పీపీపీ విధానంలో సమకూర్చుకుంటాము.
• ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య విధానం వల్ల ప్రొజెక్టుకు నిధుల సమస్య ఉండదు.
• కార్యాచరణ ప్రారంభం నుండి ఫేజ్-II ఆర్థికంగా నిలదొక్కుకునేలా పలు చర్యలు తీసుకోవడం జరుగుతోంది.
• ఆర్ఓడబ్ల్యూ, స్టేషన్లు, డిపోలు మొదలైనవాటికి అతి తక్కువ మొత్తంలో భూసేకరణ చేసేలా ప్రణాళిక చేస్తున్నాం.
• ఖర్చు తగ్గించడానికి స్టేషన్ల డిజైన్లను కూడా వైవిధ్యంగా చేయడం జరుగుతోంది.
• మొదటి దశలో ఉన్న మౌలిక సౌకర్యాలను వినియోగించుకోవడం, ప్రభుత్వ భూముల్లో డిపోలను ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా ఖర్చు తగ్గించుకుంటున్నాము.
• కేంద్ర ప్రభుత్వం ద్వారా సావరిన్ గ్యారెంటీతో మల్టీ లేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎండీబీ) రుణాలపై చాలా తక్కువ వడ్డీ రేట్లు (సుమారు 2%) (ఫేజ్-I లో భారతీయ బ్యాంకుల వడ్డీ 9 నుండి 10%).
• ఒక కిలోమీటర్ కి నిర్మాణ వ్యయం హైదరాబాద్ ఫేజ్ -II కేవలం రూ.318 కోట్ల అంచనా అయితే, బెంగళూరు రూ.373 కోట్ల నుండి రూ.569 కోట్లు; చెన్నై రూ. 619 కోట్ల నుండి రూ. 756 కోట్లు; ముంబై రూ. 543 కోట్ల నుండి రూ. 1,492 కోట్లుగా ఉంది.
• ఎలివేటెడ్ మెట్రో వలన, design innovations వలన హైదరాబాద్ లో తక్కువ ఖర్చుతో మెట్రో రెండవ దశను చేయనున్నాము.
• ఫేజ్-2 ప్రతిపాదన, DPR, CMP, ప్రత్యామ్నాయాల విశ్లేషణ మొదలైన వాటిపై, కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాంకేతిక, ఆర్థిక ఎవాల్యుయేషన్ జరుగుతోంది.
• భూసేకరణ వేగవంతంగా జరుగుతోంది.
• పాత నగర మెట్రో వల్ల, రోడ్డు విస్తరణ వల్ల ప్రభావితమైన 1100 పైగా ఆస్తులలో, 800 ఆస్తుల స్కెచ్‌లు కలెక్టర్‌కు పంపడం జరిగింది. వారసత్వ, మత కట్టడాలు అన్నిటినీ ఇంజినీరింగ్ పరిష్కారంతో భద్రంగా ఉంచగలుగుతాము.
• డిసెంబర్ నాలుగో వారంలో భూ సేకరణ చట్టం ప్రకారం సేకరించిన ఆస్తుల కూల్చివేతలు ప్రారంభం అవుతాయి.
• పాత బస్తీలో “ప్రాథమిక పనులు”2025 జనవరి మొదటి వారంలో ప్రారంభం అవుతాయి.