చిన్న నిర్లక్ష్యం.. ప్రాణాల మీదకు తెచ్చిన దోమల బత్తి
ఇంట్లో వెలిగించిన దోమల బత్తి ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది.
By Srikanth Gundamalla Published on 31 Jan 2024 5:02 AM GMTచిన్న నిర్లక్ష్యం.. ప్రాణాల మీదకు తెచ్చిన దోమల బత్తి
ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? ఆల్ అవుట్ లేదంటే ఇతర లిక్విడ్‌లను ఉపయోగిస్తారు. తద్వారా దోమల బెడద నుంచి తప్పించుకుంటారు. ఇంకా కొందరు దోమల బత్తుల (మస్కిటో కాయిల్) వంటివి వాడుతుంటారు. ముఖ్యంగా నిద్రపోయే ముందు వాటిని వెలిగించి పడుకుంటారు. దాని నుంచి వచ్చే పొగకు దోమలు అస్సలు బయటకు రావు. అయితే.. ఇలానే చేశాడు హైదరాబాద్‌లో ఓ వ్యక్తి. కానీ.. చిన్నపాటి నిర్లక్ష్యం చేయడంతో అతను ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఈ సంఘటన. ఇస్మాయిల్ నగర్‌లో మహ్మద్ అద్దిక్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. అయితే.. అతని ఇంట్లో దోమలు ఎక్కువగా తిరుగుతున్నాయి.. నిద్ర కూడా పోనివ్వడం లేదు. దాంతో.. వాటి బెడద నుంచి తప్పించుకునేందుకు అద్దిక్ రాత్రి నిద్రపోయే ముందు దోమల బత్తిని వెలిగించాడు. అయితే.. తన దగ్గరగా పెట్టుకుంటే దోమలు అస్సలు దగ్గరకు రావని భావించాడేమో.. పడకకు చాలా దగ్గరగా కాయిల్‌ను వెలిగించి పడుకున్నాడు. అయితే.. నిద్రలో ఉండగా అనుకోకుండా కాయిల్ అద్దిక్ కప్పుకున్న దుప్పటికి అంటుకుంది. మెల్లిగా మంటలు చెలరేగాయి. నిద్రమత్తులో ఉన్న కారణంగా అతను చూసుకోలేదు.
అయితే.. కొద్దిసేపటికే మంటలు పూర్తిగా వ్యాపించాయి. అతను గ్రహించే లోపే మంటల్లో చిక్కుకున్నాడు. ఇక ఇది గమనించిన కుటుంబ సభ్యులు మంటలను అదుపు చేశారు. ఆ తర్వాత అద్దిక్‌ను ఆస్పత్రికి తరలించారు. అద్దిక్‌ను పరిశీలించిన వైద్యులు 70 నుంచి 80 శాతం వరకు గాయాలు అయినట్లు వెల్లడించారు. ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నామనీ.. ప్రస్తుతం అద్దిక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఇక ఇదే సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.