మెట్రో స్టేషన్లలో టాయిలెట్స్ వినియోగించుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే
హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ పనులను సులభ్ ఇంటర్నేషనల్‌కు అప్పగించిన తర్వాత టాయిలెట్లను ఉపయోగించే వారిపై ఛార్జీలు
By అంజి Published on 3 Jun 2023 2:00 AM GMTమెట్రో స్టేషన్లలో టాయిలెట్స్ వినియోగించుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే
హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ పనులను సులభ్ ఇంటర్నేషనల్‌కు అప్పగించిన తర్వాత టాయిలెట్లను ఉపయోగించే వారిపై ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. మూత్ర విసర్జనకు రూ.2, మరుగుదొడ్ల వినియోగానికి రూ.5 వసూలు చేయనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే దీనిపై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మెట్రో రైలు స్టేషన్లలో టాయిలెట్లు నాసిరకంగా ఉన్నాయని, వాటి నిర్వహణ అధ్వానంగా ఉందని పలువురు తెలిపారు. ప్రయాణికులు ఇప్పుడు టాయిలెట్ల కోసం డబ్బులు చెల్లిస్తున్నందున, మెరుగైన సేవ, పరిశుభ్రత ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే ప్రీమియం ఛార్జీలు చెల్లిస్తున్నామని కొందరు వాదిస్తూ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. మెట్రో రైలు టిక్కెట్టు ఛార్జీలోపు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. మరుగుదొడ్ల నిర్వహణను అప్పగించాలనే ఈ నిర్ణయంతో స్టేషన్లలోని మరుగుదొడ్లు, మూత్రశాలలను శానిటైజ్ చేయడం తప్పనిసరి అని మెట్రో రైల్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఆలపాటి కౌశిక్ అనే మేనేజ్‌మెంట్ విద్యార్థి మాట్లాడుతూ.. "ఈ సౌకర్యాలు ఉచితంగా అందించాలి. నేను ఇటీవల చెన్నైకి వెళ్లాను. స్టేడియం నుండి చెన్నై సెంట్రల్‌కు ప్రయాణించినప్పుడు మా మెట్రోతో పోలిస్తే ఛార్జీలు సహేతుకమైనవని గుర్తించాను" అని అన్నారు.
ఐటీ ఉద్యోగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఇది సరైన నిర్ణయమేనని.. మెట్రో టాయిలెట్లు చాలా వరకు సరైన స్థాయిలో లేవని డబ్బులు చెల్లించడం ద్వారా మెరుగైన సేవలు పొందవచ్చని అన్నారు. మరికొందరు ప్రయాణికులు మాత్రం ఈ నిర్ణయం సరికాదని అంటున్నారు. ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తున్నప్పుడు.. ఆ మాత్రం సేవలు కల్పించాలని అంటున్నారు. ప్రయాణికుల నుంచి వస్తున్న ఈ మిశ్రమ స్పందనపై మెట్రో రైలు నిర్వహకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.