న్యూఇయర్ వేడుకలు జరుపుకునే హైదరాబాదీలకు హైదరాబాద్ మెట్రో రైల్ శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగించింది. డిసెంబర్ 31 న మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు నడుస్తాయని, చివరి రైలు 12:15 గంటలకు బయలుదేరి, జనవరి 1 న తెల్లవారుజామున 1:00 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని హైదరాబాద్ మెట్రో రైలు ప్రకటించింది. అన్ని రెడ్, బ్లూ, గ్రీన్ లైన్లలో పొడిగించిన సేవలు అమలులో ఉంటాయి.
పొడిగించిన సేవా సమయాల్లో మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని అన్నారు. రైళ్లు, స్టేషన్లలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా మెట్రో రైలు భద్రత అప్రమత్తంగా ఉంటుందని హెచ్‌ఎంఆర్ శనివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరించారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. సాధారణంగా, హైదరాబాద్ మెట్రో రైలు సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్లలో ఉదయం 6:00 నుండి రాత్రి 11:00 వరకు నడుస్తాయి.