హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గమనిక. జూన్ 30వ తేదీ నుంచి నుండి జూలై 16వ తేదీ వరకు జూబ్లీ బస్ స్టేషన్ నుండి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మధ్య కారిడార్-II లో ఉదయం సర్వీసులలో 30 నిమిషాలు ఆలస్యం కానుందని మెట్రో యాజమాన్యం తెలిపింది. ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయని మెట్రో అధికారులు వివరించారు. సాధారణంగా ఉదయం 6 గంటలకు ప్రారంభం కావలసిన రైలు సేవలు అర్ధగంట ఆలస్యంగా ప్రారంభం అవుతాయి. దీనికి ప్రయాణికులు సహకరించాలని మెట్రో కోరింది.
ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా జేబీఎస్ నుంచి సీబీఎస్ వెళ్లే మార్గంలో మెట్రో రాకపోకలలో మార్పులు చేసినట్లు ఎల్అండ్‌టీ అధికారులు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) అభ్యర్థన మేరకు సవరించిన షెడ్యూల్‌ను రూపొందించారు. మిగతా మార్గాల్లో మెట్రో రైళ్ల వేళల్లో ఎలాంటి మార్పులూ లేవు. కారిడార్‌లో ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. సవరించిన షెడ్యూల్ దాదాపు రెండు వారాల పాటు అమలులో ఉంటుందని సంస్థ తెలిపింది.