హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రేపటి (సోమవారం) నుంచి స్వల్పంగా మార్పు చేసినట్లు ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించింది. ప్రతిరోజూ అన్ని టెర్మినల్స్ నుంచి ఉదయం 6 గంటలకు మొదటి రైలు బయలుదేరుతుందని, రాత్రి 11 గంటలకు చివరి మెట్రో రైలు అని తెలిపింది. అంటే ప్రస్తుతం కొనసాగుతున్న సమయాన్ని 45 నిమిషాలు కుదించినట్లు ఎల్ అండ్ టీ యాజమాన్యం స్పష్టం చేసింది. 3వ తేదీ నుంచి ఈ సమయాలు అందుబాటులోకి వస్తాయని, ప్రయాణి కులు గమనించాలని ఎల్అండ్ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది.
చివరి మెట్రో రైలు ..
ప్రస్తుతం కొనసాగుతున్న మెట్రో సమయాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటలకు మొదటి మెట్రో, రాత్రి 11.45 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుంది. శనివారం ఉదయం 6 గంటలకు మొదటి మెట్రో, రాత్రి 11 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుంది. ఆదివారం మాత్రం ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో రైలు, రాత్రి 11 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుంది. 3వ తేదీ నుంచి అన్ని రోజుల్లో అన్ని టెర్మినల్స్ నుంచి ఉదయం 6 గంటలకు మొదటి మెట్రో, రాత్రి 11 గంటలకు చివరి మెట్రో బయలుదేరుతుందని మెట్రో యాజమాన్యం స్పష్టం చేసింది.