Hyderabad Metro : హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌.. మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీ క‌ట్‌

హైద‌రాబాద్ మెట్రో కార్డుల‌కు ఇస్తున్న రాయితీని ర‌ద్దీ వేళ్ల‌లో ఎత్తివేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2023 4:33 AM GMT
Hyderabad Metro Rail,Subsidy

రద్దీ వేళల్లో రాయితీ క‌ట్‌

హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు మెట్రో షాకిచ్చింది. చార్జీలు పెంచ‌కుండానే ప్ర‌యాణీకుల‌పై కొంత భారం వేసింది. నేటి(ఏప్రిల్ 1) నుంచి మెట్రో రాయితీల‌లో కోత విధించింది. రద్దీ వేళల్లో డిస్కౌంట్‌ను పూర్తిగా ఎత్తివేయనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. అంతేకాకుండా సూప‌ర్ సేవ‌ర్ హాలీడే కార్డ్ ఛార్జ్ కూడా భారీగా పెంచారు.

కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు మెట్రో కార్డు, క్యూఆర్‌ కోడ్‌పై ప్ర‌యాణ ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్ ఇస్తుండ‌గా ఇప్పుడు దీన్నిపై కోత విధించారు. ర‌ద్దీ వేళ‌లు అంటే ఉద‌యం 8 నుంచి రాత్రి 8 వ‌ర‌కు ఈ డిస్కౌంట్ ఉండ‌దు. ఉద‌యం 6 నుంచి 8 వ‌ర‌కు మ‌రియు రాత్రి 8 నుంచి 12 గంట‌ల మ‌ధ్య‌లో ప్ర‌యాణించే వారికి మాత్ర‌మే రాయితీ వ‌ర్తించ‌నుంది.

అటు సెలవు రోజుల్లో ప్రయాణించే సూపర్ సేవర్ హాలీడే కార్డ్ ఛార్జీని భారీగా పెంచారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కార్డు ధ‌ర రూ.59 ఉండ‌గా దాన్ని రూ.99కి పెంచారు. ఇప్ప‌టికే రూ.59తో కార్డు తీసుకున్న వారు సూపర్ సేవర్ రూ.99 రీఛార్జ్‌ చేసుకోవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. అయితే..కొత్తగా తీసుకునే వారు మాత్రం రూ.100 చెల్లించాలన్నారు. అలాగే కాంటాక్ట్‌ లెస్‌ స్మార్ట్‌ కార్డ్స్‌ ధరను భారీగా పెంచారు.

Next Story