హైదరాబాద్‌ మెట్రో ఫ్రీక్వెన్సీ పెంపు.. రద్దీ వేళల్లో 2 నిమిషాలకో మెట్రో

Hyderabad Metro Rail Limited increases train frequency. హైదరాబాద్: రద్దీగా ఉండే రైళ్ల సమస్యను పరిష్కరించేందుకు, రద్దీ సమయాల్లో రైలు

By అంజి  Published on  26 Jan 2023 8:34 AM GMT
హైదరాబాద్‌ మెట్రో ఫ్రీక్వెన్సీ పెంపు.. రద్దీ వేళల్లో 2 నిమిషాలకో మెట్రో

హైదరాబాద్: రద్దీగా ఉండే రైళ్ల సమస్యను పరిష్కరించేందుకు, రద్దీ సమయాల్లో రైలు ఫ్రీక్వెన్సీని మూడు నిమిషాల కంటే తక్కువకు పెంచాలని హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) నిర్ణయించింది. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ ట్వీట్‌పై హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి స్పందించారు. తాము మరిన్ని రైళ్లను కొనుగోలు చేయమని ఎల్‌అండ్‌టి టాప్ మేనేజ్‌మెంట్‌ను కోరామని చెప్పారు. అయితే ఇది సమయం తీసుకుంటోందన్నారు. మధ్యంతర ఉపశమనంగా రద్దీ సమయాల్లో రైలు ఫ్రీక్వెన్సీని 3 నిమిషాల కంటే తక్కువకు పెంచామని, షార్ట్ లూప్ సర్వీస్‌లు ప్రవేశపెట్టబడ్డాయని చెప్పారు.

రద్దీ సమయాల్లో మెట్రో రైళ్లలో నిలబడటానికి కూడా చోటు ఉండని పరిస్థితి ఉంది. అందుకే రద్దీ వేళల్లో ప్రతి 3 నిమిషాలకు ఒక ట్రైన్ నడుపుతున్నారు. అయితే ఇప్పుడీ సమయాన్ని మరింత తగ్గించేందుకు మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రద్దీ వేళల్లో 3 నిమిషాలకో మెట్రో రైలు నడుస్తుండగా, ఆ గ్యాప్‌ని ఇప్పుడు 2 నిమిషాలకు తగ్గించాలని సూచించారు. దీంతో పాటు అమీర్‌పేట నుంచి హైటెక్‌ సిటీ వెళ్లే మార్గంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల మధ్య రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ రూట్‌లో షార్ట్‌ లూప్‌ సర్వీసులు నడపనున్నారు.

హైదరాబాద్‌లో దాదాపు 4.5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైల్‌పై ఆధారపడి ఉన్నారు

రోజూ దాదాపు 4.5 లక్షల మంది హైదరాబాద్‌ ప్రయాణికులు మెట్రో రైల్‌లో ప్రయాణిస్తున్నారు. అయితే, ఇది కేవలం సగం సామర్థ్యం మాత్రమే. ఆక్యుపెన్సీ గరిష్ట స్థాయికి చేరుకోనప్పటికీ, నిర్దిష్ట సమయాల్లో కొన్ని మార్గాల్లో భారీ రద్దీ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మూడు బోగీల సంఖ్యను ఆరుకు పెంచడం ద్వారా రైళ్ల రద్దీ, స్టేషన్లలో రద్దీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

పాతబస్తీ ఇప్పటికీ మెట్రో రైలు కోసం ఎదురుచూస్తోంది

మెట్రో రైలు నవంబర్ 29, 2017న హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పటి నుండి HMRL కొత్త కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఇటీవలి సాంకేతిక లోపాలు మెట్రో సేవను ప్రభావితం చేసినప్పటికీ, ఇది హైదరాబాద్‌లో అత్యంత ఇష్టపడే రవాణా మార్గంగా పరిగణించబడుతుంది. అయితే పాతబస్తీలో ఇంతవరకు మెట్రో రైలు అందుబాటులోకి రాలేదు. AIMIM ఎమ్మెల్యే అక్బర్దుద్దీన్ ఒవైసీతో సహా రాజకీయ నాయకులు అనేక వినతులు చేసినప్పటికీ, మెట్రో రైలు ఇంకా పాతబస్తీకి రాలేదు.

Next Story