సరికొత్త రికార్డ్ సృష్టించిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో రైలు తన కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు 40 కోట్ల మంది ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు తీసుకువెళ్లింది.
By అంజి Published on 2 July 2023 10:55 AM ISTసరికొత్త రికార్డ్ సృష్టించిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు నెలకొల్పింది. తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకర్షించింది. కూల్ అండ్ సేఫ్ జర్నీ కావడంతో నగర వాసులు కూడా దీనివైపు మొగ్గు చూపారు. హైదరాబాద్ మెట్రో రైలు తన కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు 40 కోట్ల మంది ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు తీసుకువెళ్లింది. రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు పని దినాలలో రోజుకు 4.90 లక్షల మంది ప్రయాణీకులు ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇది 5 లక్షల మార్కును దాటుతుందని తాము భావిస్తున్నామని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.
భారత ప్రభుత్వ గణన పద్ధతి ప్రకారం.. హైదరాబాద్ ప్రయాణీకుల సంఖ్య రోజుకు 6.70 లక్షలు (దీనిని రోజువారీ ప్రయాణీకుల ప్రయాణాలు అంటారు). అలాగే 1.20 లక్షల మంది రోజువారీ విద్యార్థి ప్రయాణీకులతో విద్యార్థులు రెండవ అతిపెద్ద మెట్రో రైలు ప్రయాణీకులను కలిగి ఉన్నారు. ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల తర్వాత మొదటి స్థానంలో ఉన్నారు (సుమారు 1.40 లక్షల మంది ప్రయాణికులు). 2017 నవంబర్ 28న హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభం అయింది. దీన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.
ప్రారంభం నాటి నుంచి హైదరాబాద్ మెట్రోకు మంచి ఆదరణ లభించింది. నగరంలో నిత్యం ట్రాఫిక్ చిక్కుల్లో పడకుండా ఉండేందుకు ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ మెట్రో విద్యార్థుల సౌకర్యార్థం స్టూడెంట్ పాస్-2023ని ప్రకటించింది. వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థుల కోసం కొత్తగా స్టూడెంట్ పాస్ అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ కార్డ్ రూపంలో ఇది అందుబాటులో ఉండనుంది. ఈ పాస్ కోసం విద్యార్థులు 20 ట్రిప్పుల మొత్తాన్ని చెల్లించి 30 రోజుల్లో 30 రైడ్‌లు చుట్టేయచ్చు.