త్వరలో హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంపు
Hyderabad metro fare to increase soon. హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. 5 నుంచి 10 శాతం వరకు
By అంజి Published on 6 Jan 2023 4:00 PM ISTహైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. 5 నుంచి 10 శాతం వరకు ధరలు పెంచే అవకాశం ఉందని మెట్రో యాజమాన్యం వర్గాలు తెలిపాయి. త్వరలో వెలువడనున్న ఫేర్ ఫిక్సేషన్ కమిటీ నివేదికపై మెట్రో టికెట్ ధరల పెంపు ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీల సవరణకు సిఫార్సు చేసేందుకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అక్టోబర్‌లో ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరికి గరిష్టంగా 100 టికెట్ ధరను పెంచాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు.
ప్రస్తుతం ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు మెట్రో కనీస ఛార్జీ రూ.10 కాగా, గరిష్ట ఛార్జీ రూ.60గా ఉంది. అయితే ప్రస్తుతం కనీసంగా ఉన్న 10 రూపాయల ఛార్జీని 20 రూపాయలకు, గరిష్టంగా ఉన్న 60 రూపాయల ఛార్జీని 80 రూపాయల వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెట్రోలో ఒక రోజుకు సుమారు 4 లక్షల నుంచి 4 లక్షల 50 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో ఛార్జీల పెంచితే ప్రయాణికుల సంఖ్యపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.
మెట్రో నిర్మాణానికి తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ చెల్లింపులు, మెట్రో స్టేషన్లు, రైళ్లు, డిపోల నిర్వహణ భారంగా మారింది. ఈ క్రమంలోనే ఛార్జీల పెంపుకు మెట్రో శ్రీకారం చుట్టింది. అయితే మెట్రో స్టేషన్ల నుంచి దగ్గర్లోని కాలనీలకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడం, మెట్రో స్టేషన్ల దగ్గర సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం కారణంగా ఆశించిన స్థాయిలో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరగడం లేదు. మరో వైపు మెట్రో స్టేషన్లలో సిబ్బందికి సరైన జీతాలు చెల్లించడం లేదని తెలుస్తోంది.