మెట్రో స్టేషన్లలో టికెటింగ్ సిబ్బంది ధర్నా
Hyderabad Metro Contract Employees Strike.హైదరాబాద్ మెట్రో రైలు ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు
By తోట వంశీ కుమార్ Published on 3 Jan 2023 7:25 AM GMTహైదరాబాద్ మెట్రో రైలు ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్‌లోని 27 మెట్రో స్టేషన్లలో పని చేస్తున్న టికెట్ కౌంటర్లలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆయా స్టేషన్ల వద్ద ధర్నాకు దిగారు. గత ఐదేళ్లుగా తమ జీతాలు పెంచలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్నప్పుడు రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని, కనీసం భోజనం చేసేందుకు సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు.
గత ఐదేళ్లుగా నెలకు రూ.11వేలు మాత్రమే ఇస్తున్నారని, ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఆ మొత్తం కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోవడం లేదని అంటున్నారు. వేతనాలు పెంచే వరకు వెనక్కి తగ్గమని తేల్చి చెప్పారు. దీనిపై కాంట్రాక్ట్ ఏజెన్సీ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
టికెటింగ్ సిబ్బంది ఆందోళన చేస్తుండడంతో ఎల్బీనగర్-మియాపూర్ కారిడార్‌లోని ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్పందించిన మెట్రో అధికారులు ఇతర ఉద్యోగులను కూర్చోబెట్టి టికెట్లు జారీ చేయిస్తున్నారు. టికెట్ల జారీ ఆలస్యం అవుతోంది. దీంతో టికెట్ల కోసం మెట్రో స్టేషన్లలలో ప్రయాణీకులు బారులు తీరి కనిపిస్తున్నారు.
మరోవైపు సిబ్బంది ఆందోళనపై మెట్రో నిర్వాహకులు స్పందించారు. టికెటింగ్ సిబ్బంది చేస్తున్న ఆరోపణలు అవాస్తం అని అన్నారు. ట్రైన్ ఆపరేషన్ నిలిపివేసేందుకే సిబ్బంది విధుల్లోకి రాలేదన్నారు. సమయం ప్రకారమే మెట్రో రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. ధర్నా చేస్తున్న సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. సిబ్బందితో చర్చలు జరుపుతామన్నారు.