హైదరాబాద్‌లో దారుణం.. ఆలయంలో ఉద్యోగిపై యాసిడ్‌ దాడి

సైదాబాద్‌లోని శ్రీ భూలక్ష్మి అమ్మవారి ఆలయంలోని అకౌంటెంట్‌పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ పోశాడు. బాధితుడిని నర్సింగ్ రావుగా గుర్తించారు.

By అంజి
Published on : 15 March 2025 6:34 AM

Hyderabad, Man splashes acid on temple accountant, Saidabad

హైదరాబాద్‌లో దారుణం.. ఆలయంలో ఉద్యోగిపై యాసిడ్‌ దాడి

హైదరాబాద్: సైదాబాద్‌లోని శ్రీ భూలక్ష్మి అమ్మవారి ఆలయంలోని అకౌంటెంట్‌పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ పోశాడు. బాధితుడిని నర్సింగ్ రావుగా గుర్తించారు. దాడి తర్వాత ఆ ప్రాంతం నిరసనలతో అట్టుడికింది. బజరంగ్ దళ్, బిజెపి నాయకులు, భక్తులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

సైదాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌లోని లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన నర్సింగ్ రావు చాలా సంవత్సరాలుగా ఆలయంలో పనిచేస్తున్నాడు. దాడి జరిగిన రాత్రి.. నర్సింగ్ రావు తన విధులు నిర్వర్తిస్తుండగా, ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి, ఆలయంలో అర్చన, హోమాలు చేయాలనుకుంటున్నానని చెప్పాడు. నర్సింగ్ రావు రసీదు పుస్తకాన్ని సిద్ధం చేస్తుండగా, ఆ వ్యక్తి అకస్మాత్తుగా తన దగ్గరున్న సీసాలో నుండి అతనిపై యాసిడ్ పోశాడు.

ఆ తర్వాత దుండగుడు మోటార్ సైకిల్ పై అక్కడి నుంచి పారిపోయాడు. దాడితో ఆందోళన చెందిన స్థానికులు, భక్తులు వెంటనే ఆలయం వద్దకు చేరుకుని తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలతో పాటు భక్తులు నిరసనలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆలయం చుట్టూ భద్రతను పెంచారు. నర్సింగ్ రావును చికిత్స కోసం మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

సైదాబాద్ ఏసీపీ వెంకన్న నాయక్, ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, అనుమానితుడిపై సమాచారం సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story