హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని ఒక ఫర్నిచర్ దుకాణంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించడంతో.. మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఇది స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న బాట్చా ఫర్నిచర్ దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
అగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భవనం చుట్టుపక్కల పొగ దట్టంగా అలుముకుంది. పరిసర ప్రాంత వాసులను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, సంఘటన జరిగిన సమయంలో ఇద్దరు పిల్లలు భవనం లోపల ఉన్నట్లు భావిస్తున్నారు. దుకాణం నుండి భారీ మంటలు ఎగసిపడుతుండటం చుట్టుపక్కల ప్రజలలో ఆందోళన కలిగించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.