Hyderabad: 21 కిలోల లడ్డూ ఎత్తుకెళ్లి తినేసిన విద్యార్థులు

వినాయక మండపంలో గణపతి చేతిలో ఉన్న లడ్డూని ఎత్తుకెళ్లారు కొందరు స్కూల్ విద్యార్థులు. ఆ తర్వాత దాన్ని పంచుకుని తిన్నారు.

By Srikanth Gundamalla  Published on  24 Sep 2023 9:30 AM GMT
Hyderabad, lord ganapathi, Laddu theft, school students, CCTV,

 Hyderabad: 21 కిలోల లడ్డూ ఎత్తుకెళ్లి తినేసిన విద్యార్థులు

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో గణేషుడి మండపంలో లడ్డు చోరీకి గురైంది. గణపతి చేతిలోని 21 కేజీల లడ్డు కనింపించపోవడంతో.. మండపం నిర్వహకులు పోలీసులను ఆశ్రయించారు. అయితే చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డుఅయ్యాయి. దానిని చూసిన పోలీసులు ఒక్క సారిగా అవాక్కయ్యారు.

వివరాల్లోకి వెళితే.. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాన్సీ బజార్ ప్రాంతంలో శ్యామ్ అగ్రవాల్ అనే వ్యక్తి వినాయక మండపం ఏర్పాటు చేశాడు. అందులో గణేశుని విగ్రహం నెలకొల్పి గణనాథుడి చేతిలో 21 కేజీల లడ్డును ఉంచాడు. గత ఆరు రోజులుగా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నాడు. అయితే శనివారం సాయంత్రం కొంతమంది స్కూల్ విద్యార్థులు గణపతి చేతిలోని లడ్డును ఎత్తుకెళ్లారు. ఝాన్సీ బజార్ పరిసర ప్రాంతంలో ఉన్న ఓ ప్రయివేట్‌ స్కూల్ కు చెందిన పలువురు మైనర్ బాలురు ఇంటికి వెళ్తున్న తరుణంలో గణనాథుడి చేతిలో ఉన్న 21 కిలోల లడ్డును గమనించారు. కొందరు స్టూడెంట్స్ మండపంలో ఎవరూ లేరని చూసి.. మెల్లిగా లోపలికి ప్రవేశించి విఘ్నేశ్వరుడి చేతిలోని లడ్డును తీసుకొని అక్కడినుండి పారిపోయారు.

అనంతరం విద్యార్థులు ఆ లడ్డును సమానంగా పంచుకుని తినేశారు. అయితే ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. లడ్డు చోరీకి గురి కావడంతో మండపం నిర్వాహకుడు శ్యామ్ అగ్రర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలు పరిశీలించడంతో చోరీ చేసింది మైనర్ విద్యార్థులు అని తెలింది. దాంతో.. పోలీసులు ఒక్కసారిగా ఆ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇక ఈ సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియలేదు. పిల్లలే కదా అని వదిలేయాలని కొందరు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడికి ఎంత ప్రాధాన్యత ఉందో... ఆయన చేతిలో ఉన్న లడ్డుకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. గణపతి చేతిలో ఉన్న లడ్డు కూడా నవరాత్రులు ఘనంగా పూజలు అందుకుంటుంది. అంతే కాదు నవరాత్రుల చివరి రోజు ఈ లడ్డుకు వేలం కూడా వేస్తారు. లక్షల్లో వేలం పాట పాడి కొంతమంది లడ్డు దక్కించుకుంటారు లడ్డును దక్కించుకున్న వారు కుటుంబాలకి సిరిసంపదలు, ఆయురా రోగ్యాలు చేకూరుతాయని భక్తులు నమ్ముతారు. అయితే గత కొన్ని రోజులుగా నగరంలో పలుచోట్ల లడ్డు చోరీకి గురి అవుతున్నాయి.

Next Story