హైదరాబాద్: ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస లిఫ్ట్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటి మసీద్ ఎదురుగా ఉన్న సందులో నాకో షామ్ అనే అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఆరుగురు (ముగ్గురు చిన్నారులు, ముగ్గురు పెద్దలు) ప్యాసింజర్లతో ఐదవ ఫ్లోర్‌కి వెళ్తున్న లిఫ్ట్, సాంకేతిక లోపం వల్ల ఐదో ఫ్లోర్ నుంచి కిందికి జారి పడింది. దీంతో లిఫ్ట్‌లో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే అత్తాపూర్ జర్మెంటైన్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దగ్గర ఉండి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారు నిరుపేదలు కావడంతో వారికి సంబంధిత ఆసుపత్రి ఖర్చులను తనే దగ్గర ఉండి చూసుకుంటానని ఎటువంటి భయాందోళనకు కావద్దని వారి కుటుంబ సభ్యులకు ఓదార్చారు.