Hyderabad: గంగమ్మ ఒడికి కదిలిన ఖైరతాబాద్‌ గణపతి.. కాసేపట్లో బాలాపూర్‌ లడ్డూ వేలం

ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. మేళ తాళాలతో గణేషుడిని గంగమ్మ ఒడికి తరలిస్తున్నారు.

By అంజి
Published on : 6 Sept 2025 8:53 AM IST

Hyderabad, Khairatabad Maha Ganapati, Shobha Yatra, Balapur laddu auction

Hyderabad: గంగమ్మ ఒడికి కదిలిన ఖైరతాబాద్‌ గణపతి.. కాసేపట్లో బాలాపూర్‌ లడ్డూ వేలం

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. మేళ తాళాలతో గణేషుడిని గంగమ్మ ఒడికి తరలిస్తున్నారు. శోభాయాత్రను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నగరంలోని ప్రధాన మార్గాలు గణనాథుడి నామస్మరణతో మార్మోగుతున్నాయి. గణనాథుడి రూపాన్ని చూసే భాగ్యాన్ని భక్తులందరికీ కల్పిస్తూ ఏకదంతుడు ముందుకు సాగుతున్నాడు. వెల్డింగ్‌ కారణాలతో 2 గంటలు ఆలస్యంగా శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర టెలిఫోన్‌ భవన్‌, సచివాలయం మీదుగా ట్యాంక్‌బండ్‌ వరకు చేరుకోనుంది. ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అటు కాసేపట్లో బాలాపూర్‌ లడ్డు వేలం పాట ప్రారంభం కానుంది. 1994లో తొలిసారి బాలాపూర్‌ లడ్డూను వేలం వేశారు. మొదటి ఏడాది రూ.450 వేలం పాట పాడగా, 2002లో 1,05,000 పలికింది. గత ఏడాది లడ్డూ రూ.30,01,000 పలికి రికార్డు సృష్టించింది. ఏటా జరిగే వేలం పాటలో బాలాపూర్‌ లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలుకగా.. ఈ ఏడాది ఎంత పలుకుతుందోనని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బాలాపూర్‌ గణేష్‌ వద్ద కలశపూజను పూర్తి చేశారు. ఈ ఏడాది బలాపూర్‌ లడ్డూ వేలంలో 38 మంది సభ్యులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్రను చూసేందుకు భక్తులు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు.

Next Story