ఫార్ములా-ఈ రేసింగ్: ప్రపంచ దిగ్గజ నగరాల క్లబ్‌లో హైదరాబాద్

Hyderabad joins the club of World iconic cities with conduction of Formula-E racing. ఫార్ములా- ఈ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో..

By అంజి  Published on  9 Feb 2023 8:41 AM GMT
ఫార్ములా-ఈ రేసింగ్: ప్రపంచ దిగ్గజ నగరాల క్లబ్‌లో హైదరాబాద్

ఫార్ములా- ఈ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో.. హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసింగ్ పోటీని నిర్వహించడం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తి, నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయన్నారు. ఇదో పెద్ద సవాల్ అని అన్నారు. పోటీని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్‌లో భాగంగా బుధవారం హైటెక్స్‌లో 'ది పవర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ట్రాన్స్‌ఫర్‌' అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది.

ఇందులో అల్బెర్టో లాంగో, ఎన్విజన్ రేసింగ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సిల్వైన్ ఫిలిప్పి, ఫార్ములా-ఇ స్ట్రాటజీ డైరెక్టర్ హ్యారీ బ్రౌనీ, టీ వర్క్స్ సీఈవో సుజయ్ కరంపురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్బెర్టో మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ ఫార్ములా రేస్ పోటీలకు గ్రీన్‌కో సేవలు స్వాగతిస్తున్నాయన్నారు. ఈ ప్రిక్స్ పోటీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మోటార్ స్పోర్ట్స్ అభిమానుల మదిలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ పోటీలో 11 జట్లు, 22 మంది డ్రైవర్లు తమ ప్రతిభను పరీక్షించుకోనున్నారు.

ఈ పోటీలతో హైదరాబాద్ ప్రపంచ నగరాలైన లండన్, బెర్లిన్, మెక్సికో, రోమ్, మొనాకో తదితర ప్రపంచ దిగ్గజ నగరాల్లో చేరిందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడమే ఈ ప్రిక్స్ పోటీల ముఖ్య ఉద్దేశమని వివరించారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున.. ఎన్టీఆర్‌ గార్డెన్ చుట్టూ ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్ షిప్ రేస్‌కి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ పేరుతో సిద్దం చేసిన 2.8 కిలోమీటర్ల ట్రాక్‌పై శనివారం సాయంత్రం ఫార్ములా రేస్ జరగబోతుంది. 11 టీమ్ లు.. 22 కార్లు.. ప్రాక్టీస్, క్వాలిఫైయింగ్‌తో కలిపి 4 రేస్‌లు జరుగుతాయి.

Next Story