హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 పోర్షే కారు బీభత్సం సృష్టించింది. కేబీఆర్ పార్క్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు.. ఫుట్‌పాత్ దాటి పార్క్ ప్రహరీ గ్రిల్స్‌ను ధ్వంసం చేసింది. ఆ తర్వాత చెట్టును ఢీకొట్టింది. అయితే వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో కారులో ఉన్న వారికి ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్.. కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కారు బానెట్ తీవ్రంగా దెబ్బతింది.
బంజారా హిల్స్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ మాట్లాడుతూ.. ''కారు పార్క్ గోడను ఢీకొట్టింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ర్యాష్, నిర్లక్ష్యం డ్రైవింగ్ కేసు నమోదు చేయబడింది'' అని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106 కింద కేసు నమోదు చేయబడింది. విచారణ కొనసాగుతోందని, ప్రమాదం తర్వాత తప్పించుకున్న కారు డ్రైవర్, యజమాని కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.