Hyderabad: 'పరీక్షలు వాయిదా వేయండి'.. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన
అక్టోబర్ 21 నుంచి జరగాల్సిన గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ పలువురు గ్రూప్-1 అభ్యర్థులు బుధవారం సాయంత్రం నిరసన చేపట్టారు.
By అంజి Published on 17 Oct 2024 7:37 AM ISTHyderabad: 'పరీక్షలు వాయిదా వేయండి'.. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్: అక్టోబర్ 21 నుంచి జరగాల్సిన గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ పలువురు గ్రూప్-1 అభ్యర్థులు బుధవారం సాయంత్రం నిరసన చేపట్టారు. నగరంలోని అశోక్‌నగర్‌లో పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని ఒక్కసారిగా వందల మంది రోడ్లపైకి వచ్చారు. పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రద్దీగా ఉండే రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ముందుగా ప్రిలిమ్స్, జీవో 29లో దిద్దుబాటు చేసిన తర్వాతే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పలువురు అభ్యర్థులను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఈ నెల 21 నుంచి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు కేటీఆర్ మద్ధతు తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ లేదా తెలంగాణ భవన్‌లో వారిని కలుస్తానని ట్వీట్ చేశారు. మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, అరెస్ట్ చేసిన అభ్యర్థులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలన్న కొందరు అభ్యర్థుల డిమాండ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రిలిమ్స్ రాశామని, మళ్లీ వాయిదా వేయడం ఎందుకని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం, డబ్బులు వృథా అవుతున్నాయని వాపోతున్నారు. రిజర్వేషన్లపై కోర్టులో కేసులు ఉన్నాయని, ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే మళ్లీ మొదటికి వస్తుందని మరికొందరు వాదిస్తున్నారు.