పెళ్లికి ముందే విరిగిన మంచం.. కాబోయే మామకు షాకిచ్చిన అల్లుడు
Hyderabad Groom called off the wedding after the bed broke.పెళ్లి మండపంలో కోలాహలం మొదలైంది.
By తోట వంశీ కుమార్ Published on 21 Feb 2023 7:00 AM GMTపెళ్లి మండపంలో కోలాహలం మొదలైంది. ఓ పక్క పెళ్లికి వచ్చిన వారి కోసం వివాహ వింధును సిద్దం చేస్తున్నారు. బంధువులు ఒక్కొక్కరుగా కళ్యాణ మండపానికి చేరుకుంటున్నారు. వివాహ సమయం దగ్గర పడుతోంది. అయినప్పటికి పెళ్లి కొడుకు అక్కడకు రాలేదు. ఏమైందని అమ్మాయి తండ్రి ఆరా తీయగా మండపం వద్దకు వచ్చేది లేదని పెళ్లి కొడుకు తెగేసి చెప్పాడు. పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ ఘటన ఆదివారం హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.,
మౌలాలీకి చెందిన ఓ వ్యక్తి బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి బండ్లగూడకు చెందిన ఓ యువతితో ఫిబ్రవరి 19న పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. కాగా.. వీరిద్దరికి ఇది రెండో వివాహం. పెట్టిపోతల కింద వధువుకు మొదటి పెళ్లి సమయంలో ఇచ్చిన వస్తువులనే ఇస్తామని వధువు తండ్రి ముందే చెప్పాడు. ఇందుకు సరేనన్న వరుడు.. మంచం మాత్రం కొత్తది కావాలని డిమాండ్ చేశాడు.
పెళ్లికి ఒక రోజు ముందు పరువు, డ్రెస్సింగ్ టేబుల్, అల్మారా, మంచం, ఇతర వస్తువులను వరుడి ఇంటికి పంపించారు. అయితే.. మంచం విడిభాగాలు బిగిస్తుండగా విరిపోయింది. దీంతో పాత మంచం పంపారని వరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న అతడు పెళ్లి రోజు ముహూర్త సమయం దగ్గర పడుతున్నప్పటికీ మండపానికి రాలేదు.
వధువు కుటుంబ సభ్యులు వరుడి ఇంటికి వెళ్లగా.. అక్కడ వారితో పాత మంచం పెట్టారని, అది విరిగిపోయిందని వరుడు వారిపై మండిపడ్డాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. కొత్త మంచం పెట్టమంటే పాత మంచానికి రంగులు వేసి పంపిస్తారా..? నాకు ఈ పెళ్లి వద్దే వద్దు అంటూ తేల్చి చెప్పాడు. ఎంత నచ్చజెప్పినప్పటికీ అతడు తన పంతాన్ని వీడలేదు. దీంతో వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు పక్షాలను పిలిచిన పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. వరుడిపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.