హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు మరో బ్రిడ్జి నేడు అందుబాటులోకి రానుంది. నేడు చిక్కడపల్లి - లింక్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జి ద్వారా పది నిమిషాలలోనే చిక్కడపల్లి నుంచి లిబర్టీ చేరుకోవచ్చు. కొత్త సంవత్సరంలో ప్రారంభం కాబోతున్న తొలి బ్రిడ్జి ఇదే. నేడు లింక్ బ్రిడ్జిను మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి తో కలిసి జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. లిబర్టీకి వెళ్లే పరిసర ప్రాంతవాసులకు ఈ మార్గం ఉపయోగకరంగా ఉండనుంది.
అశోక్ నగర్ నుంచి దోమలగూడ హుస్సేన్ సాగర్ నాలా లింక్ బ్రిడ్జి పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. రూ.6కోట్ల వ్యయంతో 2023లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాన బ్రిడ్జి 48 మీటర్ల విస్తీర్ణంతో నిర్మించారు. దోమలగూడ వైపు నుంచి లిబర్టీకి వెళ్లే ర్యాంపును 38 మీటర్లతో నిర్మించారు. అశోక్ నగర్ వైపు నుంచి వెళ్లే వారికి 22 మీటర్లతో ర్యాంపును నిర్మించారు. సురక్షితమైన పాదచారుల కదలికను నిర్ధారించడానికి రెండు వైపులా ఫుట్‌పాత్‌లను నిర్మించారు.