Hyderabad: 'ఫ్రీ' ప్రైమరీ స్కూల్.. వలస కార్మికులకు ఆసరా
జల్పల్లి మున్సిపల్ పరిధిలోని ఎర్రకుంటలో 100% ఉచిత ప్రైమరీ-కమ్-బ్రిడ్జి పాఠశాలను ప్రారంభించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Jun 2024 5:00 AM GMTHyderabad: 'ఫ్రీ' ప్రైమరీ స్కూల్.. వలస కార్మికులకు ఆసరా
హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ (HHF) జల్పల్లి మున్సిపల్ పరిధిలోని ఎర్రకుంటలో 100% ఉచిత ప్రైమరీ-కమ్-బ్రిడ్జి పాఠశాలను ప్రారంభించింది. నాణ్యమైన విద్యను అందించడం కోసం ఈ స్కూల్ ను మొదలు పెట్టారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వలస కార్మిక కుటుంబాలలోని చిన్న పిల్లలకు మంచి విద్యను అందించడమే ఈ పాఠశాల లక్ష్యం.
హకీంపేట్, ఎండీ లైన్స్, రాజేంద్రనగర్, కిషన్‌బాగ్, ఇతర ప్రాంతాలతో సహా 15 ప్రధాన మురికివాడల్లో హెచ్‌హెచ్‌ఎఫ్ ఇటీవల సర్వే నిర్వహించిన తర్వాత పాఠశాలను తెరవాలని నిర్ణయం తీసుకుంది. 27% మంది విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో బడి మానేసినట్లు వెల్లడించింది. 75% మంది తల్లిదండ్రులు ఈ డ్రాపౌట్‌లకు ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణమని చెప్పినట్లు సర్వేలో తేలింది. పాఠశాలకు వెళ్లే వయస్సులో ఉన్న 4% మంది పిల్లలు అసలు చదువుకోవడం లేదని తేలింది. 65% డ్రాపౌట్ కేసులలో మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి వలస వచ్చిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఉన్నారు. స్థానిక విద్యా వ్యవస్థలోకి వీరిని చేర్చడం కూడా అనేక సవాళ్లతో కూడుకున్నదే.
ఈ మురికివాడలలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, 55% మంది తల్లిదండ్రులకు రవాణాసదుపాయాలు అనేది ఒక భయంకరమైన అడ్డంకిగా మారింది. కౌన్సెలింగ్ చేసినా ఊహించని ఫలితాలు అయితే కనిపించలేదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని HHF ఒక ప్రాథమిక పాఠశాలను ప్రారంభించింది, ఇప్పటివరకు 400 మంది విద్యార్థులు అందులో చేరారు. బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో సహా 14 తరగతి గదులతో కూడిన ఈ సంస్థలో 12 మంది అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ఒక ప్రధానోపాధ్యాయురాలు, కౌన్సెలర్లు, సహాయక సిబ్బందితో కూడిన బృందం ఉంది. పేదవారికి నాణ్యమైన విద్యను అందించడమే HHF ముఖ్య ఉద్దేశ్యం.