హైదరాబాద్‌లో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యాకత్‌పురాలో అగ్నిప్రమాదం సంభవించింది. రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటన్ గోదాంలో మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ యాకత్‌పురాలోని రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో షౌకత్ జంగ్ దేవి కంపెనీ కాటన్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. కంపెనీ బయటకు పొగలు, మంటలు వెదజల్లుతూ ఉండడంతో స్థానికులు అది చూసి భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు త్వరితగతిన వ్యాపిస్తూ ఉండడంతో వెంటనే స్థానికులు పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తూ ఉండడంతో నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ మంటల్లో షౌకత్ జంగ్ దేవి కంపెనీ కాటన్ గోదాం పూర్తిగా తగలబడినట్లు తెలుస్తోంది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ కంపెనీ చుట్టుపక్కల ఉన్న వారందరిని ఖాళీ చేయించారు. కంపెనీ యజమాని ఘటన స్థలానికి చేరుకున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. అయితే.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.