Hyderabad: రెండు వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాలు
హైదరాబాద్‌లో రెండు వేర్వేరు చోట్ల అగ్నిప్రమాద సంఘటనలు చోటుచేసుకున్నాయి.
By Srikanth Gundamalla Published on 25 Jan 2024 9:30 PM ISTHyderabad: రెండు వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాలు
హైదరాబాద్‌లో రెండు వేర్వేరు చోట్ల అగ్నిప్రమాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పక్కన ఒక కారులో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. దాంతో.. అప్రమత్తమైన ప్రయాణికులు కారుని నడిరోడ్డుపైనే ఆపి కిందకు దిగారు. ఇక కారులో మంటలు క్రమంగా పెరిగి పెద్దగా అంటుకున్నాయి. దాంతో.. ఇతర వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. దట్టమైన పొగ కూడా అలుముకోవడంతో చీకటి మయం అయ్యింది. అయితే..ఈ ప్రమాదం వల్ల రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఫైరింజన్ సిబ్బంది వెంటనే అక్కడకి చేరుకున్నారు మంటను అదుపు చేశారు. ఆ తర్వాత పోలీసులు కారుని పక్కకు తీశారు. ఈ సంఘటనలో కారు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై మరో అగ్నిప్రమాదం సంభవించింది. రోడ్డు రోలర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాసేపటికే పెద్ద ఎత్తున అంటుకున్నాయి. భారీ వాహనం కావడంతో మంటలు పెద్ద ఎత్తున కనిపించాయి.. దట్టమైప పొగ ఆ ప్రాంతాన్ని చుట్టేసింది. ఇక మంటల గురించి ఇతర వాహనదారులు, స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రోడ్డు మధ్యలో రోడ్‌రోలర్ కాలిపోతున్న విషయం తెలుసుకున్న వారు వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కాసేపు శ్రమించిన తర్వాత మంటలను పూర్తిగా ఆర్పేశారు. కాగా.. ఈ సంఘటనలో కూడా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. మరి రెండు అగ్నిప్రమాదాలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదాలపై ఆయా పరిధిలోని పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.