జేపీ సినిమాస్‌లో అగ్నిప్రమాదం.. ఫర్నీచర్ దగ్ధం
చందానగర్ పరిధిలోని జేపీ సినిమాస్‌లో మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 12 Aug 2023 4:37 AM GMTజేపీ సినిమాస్‌లో అగ్నిప్రమాదం.. ఫర్నీచర్ దగ్ధం
హైదరాబాద్ నగరంలోని చందానగర్ పరిధిలో గంగారం జేపీ సినిమాస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కపాడియా షాపింగ్ మాల్‌లోని ఐదో అంతస్తులో ఉన్న జేపీ సినిమాస్‌లో ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జేపీ సినిమాస్‌లోని ఫర్నీచర్ దగ్ధం అయినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. 7 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేశారు.
టపాడియా మాల్‌లో మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చామని ఫైర్ ఆఫీసర్ గిరిధర్‌రెడ్డి తెలిపారు. మాల్‌లోని ఐదో ఫ్లోర్ జేపీ సినిమాస్‌లోనే అగ్నిప్రమాదం సంభవించిందని ఆయన తెలిపారు. 7 ఫైరింజన్లతో మంటలను ఆర్పేసినట్లు తెలిపారు. మంటల తీవ్రత కేవలం లాబీలో మాత్రమే ఉండిందని చెప్పారు. థియేటర్‌లోని స్క్రీన్‌లకు ఎలాంటి మంటలు అంటుకోలేదని చెప్పారు. కారిడార్‌లో ఉన్న ఫర్నీచర్, సోఫాలు మంటల్లో కాలిపోయినట్లు చెప్పారు. కారిడార్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్టవ్ వల్ల మంటలు అంటుకుని ఉంటాయని భావిస్తున్నట్లు ఫైర్ ఆఫీసర్ గిరిధర్‌రెడ్డి తెలిపారు. కారిడార్‌లో చిప్స్, పాప్‌కార్న్, కూల్‌డ్రింగ్స్‌కు సంబంధించిన చిన్నచిన్న దుకాణాలు ఉన్నాయని.. వాటిలోని ఒక షాపు నుంచే మంటలు వ్యాపించాయని తెలిపారు. అయితే.. థియేటర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలు ఆర్పేసి ఉంటే తీవ్రత పెరిగేది కాదని అన్నారు. కారిడార్‌లో ఫైర్ రావడంతో ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్స్‌ను ఆపేశారని ఫైర్ ఆఫీసర్ గిరిధర్‌రెడ్డి అన్నారు.
సంఘటనా స్థలానికి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెళ్లారు. పరిస్థితిని సమీక్షించారు. షాపింగ్ మాల్ కు ఫైర్ ఎన్ఓసీ లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. అనుమతులు లేకుండానే జేపీ సినిమాస్ యాజమాన్యం సినిమాలు నడిపిస్తోందని తెలుస్తోంది. ఇక అగ్నిప్రమాదం ఉదయం చోటు చేసుకోవడం.. ఆ సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలను దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని కేసు నమోదు చసిన పోలీసులు చెప్పారు.