హైదరాబాద్ నగరంలోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో భార్య, భర్త మృతదేహలు కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆ మృతదేహాలు పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉండటంతో ఈ ఘటన జరిగి మూడు నుంచి నాలుగు రోజులు అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మీర్ చౌక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. ఇంటి తలుపు లోపలి నుంచి గడియ వేసి ఉండటాన్ని గమనించిన పోలీసులు ఇది ఆత్మహత్య అయి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించగా భార్యాభర్తల మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో సంఘటనకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే మృతుల వివరాలు, వయస్సు, వారు ఏ కారణంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారన్న అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతికి గల కారణాలు నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.