Hyderabad: డిజిటల్ అరెస్ట్ మోసాలు.. ప్రజలను మరోసారి అలర్ట్ చేసిన సైబర్ క్రైమ్ యూనిట్
రోజు రోజుకు డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ యూనిట్, హైదరాబాద్ ప్రజలను అలర్ట్ చేస్తూ వస్తోంది.
By - అంజి |
Hyderabad: డిజిటల్ అరెస్ట్ మోసాలు.. ప్రజలను మరోసారి అలర్ట్ చేసిన సైబర్ క్రైమ్ యూనిట్
హైదరాబాద్: రోజు రోజుకు డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ యూనిట్, హైదరాబాద్ ప్రజలను అలర్ట్ చేస్తూ వస్తోంది. ఈ స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాజాగా మరోసారి హెచ్చరించింది. ఈ స్కామ్స్‌లో నకిలీ పోలీస్, ప్రభుత్వ అధికారుల్లా నటిస్తూ.. బాధితుల్ని మనీ లాండరింగ్, ట్రాఫికింగ్, నార్కోటిక్స్, టెర్రరిజం వంటి నేరాల్లో అరెస్ట్ చేయబోతున్నట్లు, ఖాతాలు ఫ్రీజ్ అవుతాయని లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భయపెడతారు. ఇలాంటి సమయంలోనే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత లేదా బ్యాంక్ సమాచారాన్ని పంచుకోకూడదు. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్లు వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
సైబర్ నేరగాళ్లు ఇలా చేసే అవకాశం
- అధికారులుగా నటించడం: పోలీస్, సీబీఐ, కస్టమ్స్, ఈడీ, TRAI, DOT, NIA, ATS లేదా కొరియర్ సిబ్బంది పాత్రను పోషించి, బాధితులు సీరియస్ క్రైమ్స్‌లో ఉన్నారని చెప్పడం.
- భయపెట్టడం: అరెస్ట్, ఖాతా ఫ్రీజ్ లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు భయపెడతారు.
- నకిలీ ఆధారాలు: Fake FIRలు, నాన్-బైలబుల్ అరెస్ట్ వారెంట్లు లేదా RBI లెటర్లు పంపి నమ్మకతనాన్ని కలిగించడం.
- కుటుంబ హాని: తీవ్ర శిక్ష లేదా కుటుంబ ఖ్యాతికి హాని పడవచ్చని బెదిరించడం.
- ఆస్తి లిక్విడేషన్ డిమాండ్: “సుప్రీం కోర్టుకు సమర్పించాలి” అని చెప్పి డబ్బును తీసుకోవడం.
- “నో ఇన్వాల్వ్మెంట్ సర్టిఫికేట్” పొందడం లేదా అరెస్ట్ నివారించడానికి డబ్బు తరలించమని చెప్పడం. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచమని చెప్పడం.
- సోషల్ ఇంజినీరింగ్: కుటుంబ సభ్యులు లేదా మిత్రులకి చెప్పకుండ ఉండమని ఒత్తిడి చేయడం.
భద్రతా సూచనలు:
- భయపడకండి: డిజిటల్ అరెస్ట్ లేదు. పోలీస్ లేదా ఇతర అధికారులు డిజిటల్ ద్వారా అరెస్ట్ చేయదు.
- స్పూఫింగ్, నకిలీ డాక్యుమెంట్లకు జాగ్రత్త: కాలర్ ID స్పూఫింగ్, WhatsApp వీడియో కాల్స్, అన్ని fake. నిజమైన అధికారులు డబ్బు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అడగరు.
- సున్నితమైన సమాచారాన్ని పంచుకోవద్దు: OTPలు, ఆధార్, వ్యక్తిగత/ఆర్థిక వివరాలు పంచవద్దు. కాల్ను వెంటనే కట్ చేయండి.
- సరిగా ధృవీకరించండి: స్థానిక పోలీస్ స్టేషన్ లేదా ప్రభుత్వ అధికారిక హెల్ప్లైన్లను నేరుగా సంప్రదించండి. కాలర్ ఇచ్చిన నంబర్లు లేదా లింక్లను ఉపయోగించవద్దు.
- సాక్ష్యాలను నిలుపుకోండి: కాల్ లాగ్స్, WhatsApp మెసేజ్లు, ఇమెయిల్స్, స్క్రీన్షాట్లు, ట్రాన్సాక్షన్ IDలు, ఆప్ ఇన్స్టాలేషన్ చరిత్ర భద్రపరచండి.
- నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ (1930) కు ఫోన్ చేయండి లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి.