పోలీసులమని బెదిరించి వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన కేటుగాళ్లు
ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి ఒక యువకుడిని బెదిరించారు.
By Srikanth Gundamalla Published on 8 July 2023 10:30 AM ISTపోలీసులమని బెదిరించి వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన కేటుగాళ్లు
ఈజీగా మనీ సంపాదించేందుకు కొందరు వ్యక్తులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి ఒక యువకుడిని బెదిరించారు. అతని నుంచి డబ్బులు లాక్కున్నారు. బాధితుడు టోలిచౌకికి చెందిన బాషిఫ్ అహ్మద్ (22) బీటెక్ చదువుతున్నట్లు పోలీసులు చెప్పారు.
ఈ నెల 4న తెల్లవారు జామున 4 గంటలకు హకీంపేట దగ్గర బృందావన్ కాలనీలో బైక్‌పై వెళ్తున్నాడు బాషిఫ్ అహ్మద్. అదే సమయంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు యాక్టివాపై వచ్చారు. బాషిఫ్ అహ్మద్‌ను అడ్డుకున్నారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని అహ్మద్‌ను బెదిరించారు. ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు.? ఎందుకు బయట తిరుగుతున్నావు? అంటూ ప్రశ్నించారు. పోలీసుల అని చెప్పడంతో అహ్మద్ కొంచెం భయాందోళనకు గురయ్యాడు. డబ్బులు ఇస్తేనే తనని వదిలేస్తామని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక అహ్మద్ తన అకౌంట్లో ఉన్న రూ.3వేలు ఆగంతకులకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఘటన తర్వాత బాధితుడు అహ్మద్ ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలించారు.
అహ్మద్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. అహ్మద్ నుంచి నిందితులు ఐఫోన్ ఇయర్‌బడ్స్‌లో ఒకటి మాత్రమే లాక్కెళ్లారని చెప్పాడు. దాంతో పోలీసులు ఐఫోన్‌లోని ట్రాకర్ సాయంతో నిందితుల లోకేషన్‌ను ట్రేస్ చేశారు. వెంటనే అక్కడికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపులకు పాల్పడ్డ మగ్గురూ షేక్ మహ్మద్ సైఫ్ (23), హుమాయున్ నగర్కు చెందిన అష్వక్ అహ్మద్(23), మహ్మద్ ఇద్రిసన్(21)గా గుర్తించారు. జల్సాలకు అలవాటు పడే ఇలా అడ్డదారులు తొక్కారని పోలీసులు చెప్పారు. గతంలో కూడా ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నారని ఫిలింనగర్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు పోలీసులు. చాకచక్యంగా ముగ్గురిని పట్టుకున్న ఫిలింనగర్ పోలీసులు ఉన్నతాధికారులు అభినందించారు.