ఆర్బీఐ 'ఉద్గమ్' పేరుతో మోసాలు.. లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ గుల్ల.. ప్రజలను అలర్ట్‌ చేసిన సజ్జనార్‌

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏజెంట్లమని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసే కేటుగాళ్ల పట్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శుక్రవారం ప్రజలను హెచ్చరించారు.

By -  అంజి
Published on : 19 Dec 2025 10:53 AM IST

Hyderabad, CP VC Sajjanar warns public, fake RBI agent scam,UDGAM, Cyber Crime

ఆర్బీఐ 'ఉద్గమ్' పేరుతో మోసాలు.. లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ గుల్ల.. ప్రజలను అలర్ట్‌ చేసిన సజ్జనార్‌

హైదరాబాద్: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏజెంట్లమని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసే కేటుగాళ్ల పట్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శుక్రవారం ప్రజలను హెచ్చరించారు. ఈ స్కామ్ లో భాగంగా పాత బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని, లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చని పేర్కొంటూ సందేశాలు, ఇమెయిల్‌లు పంపబడతాయి. వీటిని నమ్మొద్దని ప్రజలకు సజ్జనార్‌ సూచించారు.

సజ్జనార్‌ ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ.. ''సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. ఈసారి ఆర్బీఐని కూడా వదలట్లే. బ్యాంకుల్లో అన్‌క్లైమ్‌డ్‌ డబ్బులు ఇప్పిస్తామంటూ జనం నెత్తిన టోపీ పెడుతున్నరు. ఆర్బీఐ తీసుకొచ్చిన 'ఉద్గమ్' (UDGAM) పోర్టల్ పేరు చెప్పి నయా దందా మొదలుపెట్టారు. "మీ పాత ఖాతాల్లో లక్షలున్నయ్.. ఈ లింక్ క్లిక్ చేసి తీసుకోండి" అని మెసేజ్ లు, మెయిల్స్ పంపిస్తున్నారు. ఆశపడి ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ ఫోన్ హ్యాక్‌కు గురవుతుందని, క్షణాల్లో బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది'' అని హెచ్చరించారు.

జర భద్రం.. ఈ జాగ్రత్తలు మస్ట్:

- ఆర్బీఐ ఎప్పుడూ మీ ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు అడగదు. ఆఫీసర్లు అని ఫోన్ చేస్తే నమ్మకండి.

- అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్ల కోసం https://udgam.rbi.org.in అనే వెబ్‌సైట్ మాత్రమే చూడాలి.

- వాట్సాప్, మెయిల్స్ లో వచ్చే పిచ్చి లింకులను అస్సలు క్లిక్ చేయొద్దు.

ఒకవేళ పొరపాటున మోసపోతే వెంటనే 1930 నంబర్ కు కాల్ చేయండి. లేదంటే http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. ఆలస్యం చేస్తే ఇక అంతే సంగతి.

Next Story