వేసవి వినోదం.. డిజిటల్ వ్యసనం కాకూడదు..పేరెంట్స్‌కు సజ్జనార్ సూచనలు.!
వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు
By - Knakam Karthik |
పిల్లలకు వేసవి వినోదం డిజిటల్ వ్యసనం కాకూడదు..పేరెంట్స్‌కు సజ్జనార్ సూచనలు!
వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. ఒకప్పుడు ఆటపాటలు, అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలతో గడిచే బాల్యం, నేడు కేవలం ఐదు అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమైపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు బిజీగా ఉంటూ పిల్లలకు సమయం కేటాయించకపోవడం వల్లే వారు డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుంటున్నారని, ఇది వారిని తీవ్ర ఒంటరితనానికి గురిచేస్తోందని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో అపరిచితుల ఉచ్చులో పడటం, రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలై నిద్రాహారాలు మానడం వల్ల పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటున్నాయని ఆయన పేర్కొన్నారు. చిన్నపాటి మందలింపులకే మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్లే ఘటనలు పెరగడం కుటుంబాల్లో తీరని వేదన మిగిలిస్తోందని అన్నారు. అందుకే ఈ వేసవిలో పిల్లలకు ఖరీదైన గ్యాడ్జెట్లు ఇచ్చే కంటే, తల్లిదండ్రులు తమ సమయాన్ని కానుకగా ఇవ్వాలని సూచించారు.
పిల్లలు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచాలని, ముఖ్యంగా పరీక్షా ఫలితాల సమయంలో వారికి కొండంత భరోసానిస్తూ సరైన దిశానిర్దేశం చేయాలని కోరారు. తల్లిదండ్రుల అప్రమత్తతే పిల్లల బంగారు భవిష్యత్తుకు అసలైన రక్ష అని ఆయన స్పష్టం చేశారు.
వేసవి వినోదం.. డిజిటల్ వ్యసనం కాకూడదు: తల్లిదండ్రులూ అప్రమత్తం!ఒకప్పుడు వేసవి సెలవులంటే అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువు గట్లు, మైదానాల్లో ఆటపాటల కోలాహలం. కానీ నేడు బాల్యం కేవలం ఐదు అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమైపోవడం ఆందోళనకరం.తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై… pic.twitter.com/azd0q8V1NE
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) April 6, 2026